IPL2021 DCvs KKR: తిప్పేసిన కేకేఆర్ బౌలర్లు... ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ విఫలం...

By Chinthakindhi RamuFirst Published Sep 28, 2021, 5:24 PM IST
Highlights

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు అద్భుతమే చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మళ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లోకి దూసుకొచ్చిన శిఖర్ ధావన్, 20 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... పృథ్వీషా గాయపడడంతో అతని స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్, 34 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి ఫర్గూసన్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు...

గత రెండు మ్యాచుల్లో 40+ పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, 5 బంతుల్లో ఒకే పరుగు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... 77 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

హెట్మయర్ 4 పరుగులు చేయగా, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ డకౌట్లు కావడంతో... వరుస వికెట్లు కోల్పోయి 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్... ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 28 పరుగులు జోడించాడు రిషబ్ పంత్. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన అశ్విన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

35 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన రిషబ్ పంత్, 20వ ఓవర్‌లో రనౌట్ అయ్యాడు... ఆఖరి ఓవర్‌లో గిల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఆవేశ్ ఖాన్‌కి బౌండరీ రాగా, ఆఖరి బంతికి అతను రనౌట్ అయ్యాడు... కేకేఆర్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా టిమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు.

click me!