IPL 2021 MI vs PBKS: గెలిచేదెవరో.. నిలిచేదెవరో..? ప్లే ఆఫ్ బెర్త్ కోసం ముంబయి, పంజాబ్ ల మధ్య నేడు కీలక మ్యాచ్

By team teluguFirst Published Sep 28, 2021, 2:18 PM IST
Highlights

MI vs PBKS Preview: ఐదు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్  అయిన ముంబయి ఇండియన్స్ జట్టు ఈసారి ఐపీఎల్ సీజన్ లో మాత్రం అనూహ్య పరాజయాలను మూటగట్టకుంటున్నది. ఇక ఈసారైనా కప్ గెలవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్.. ఆ దిశగా ముందడుగు వేయాలంటే ఆ జట్టుకు నేటి మ్యాచ్ కీలకం కానున్నది. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం దారుణ పరాజయాలతో అభిమానులను అలరించలేకపోతున్నది. ఐపీఎల్ రెండో ఫేజ్ లో అయితే గత మూడు మ్యాచ్ లలోనూ ఆ జట్టు పేలవ ఆట తీరుతో ఓటములు మూటగట్టుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నది. ఇక మరోవైపు ప్లే ఆఫ్స్ కోసం ఆశలు పెట్టుకున్న మరో జట్టు పంజాబ్ సూపర్ కింగ్స్. ఈ రెండు జట్ల మధ్య నేటి సాయంత్రం 7.30 గంటలకు కీలక మ్యాచ్ జరుగనుంది. 

ఐపీఎల్ 14 సీజన్ 42 వ మ్యాచ్ గా జరుగనున్న ఈ పోరులో ఇరు జట్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆడిన పది మ్యాచుల్లో నాలుగింటిలో (8 పాయింట్లు) గెలిచి పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా ముంబయి ఏడో  స్థానంలో ఉంది. రెండు జట్లకు 8 పాయింట్లే ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో పంజాబ్ కాస్త మెరుగ్గా ఉంది. 

జట్ల బలాబలాలు: ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లు, హిట్లర్లు,  భీకర బౌలర్లున్న ముంబయి అన్ని రంగాల్లో సమతూకంగా ఉంది. బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ రాణిస్తున్నా తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టును తీవ్రంగా బాధిస్తున్నది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలు దారుణంగా విఫలమవుతున్నారు. ఈ సీజన్ లో పది మ్యాచ్ లు ఆడిన యాదవ్ 18.9 సగటుతో 189 పరుగులు చేయగా.. 13.37 సగటుతో కిషన్ 107 పరుగులు చేశాడు. గత సీజన్ లో దుమ్మురేపిన కృనాల్.. చివరి మూడు మ్యాచుల్లో చేసిన స్కోర్లు వరుసగా 4, 12, 5.  ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రోహిత్, డికాక్ ఔటైన తర్వాత ముంబయి బ్యాటింగ్ పేకమేడలా కూలింది. పొలార్డ్, హర్ధిక్ కూడా ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలర్లలో బౌల్ట్, బుమ్రా, పొలార్డ్ రాణిస్తున్నారు. 

ఇక పంజాబ్ విషయానికొస్తే..  బ్యాటింగ్ లో సూపర్ ఫామ్ లోఉన్న కెప్టెన్ రాహుల్,  యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ వంటి హిట్టర్లు పుష్కలంగా ఉన్నా మిడిల్ ఆర్డర్ లో మరింత మెరుగుపడాలని పంజాబ్ భావిస్తున్నది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, అర్షదీప్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. 

ఇరు జట్లకు గాయాల బెడద లేకున్నా నిలకడ లేమి కారణంగా ఒకరిద్దరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాన్ని జట్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా ఇరు జట్లు ఇప్పటివరకు 27 సార్లు ముఖాముఖి తలపడగా.. ముంబయి 14 సార్లు గెలువగా పంజాబ్ 13 సార్లు నెగ్గింది. నెమ్మదిగా బ్యాటింగ్ కు అనుకూలించే ఈ ఫిచ్ పై తొలుత టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ను ఎంచుకోనున్నది.

click me!