Inzamam ul haq: ఇంజమాముల్ హక్ కు గుండెపోటు.. పాక్ జట్టుకు వరుస షాకులు..

By team teluguFirst Published Sep 28, 2021, 12:23 PM IST
Highlights

inzamam ul haq Heart attack: పాకిస్థాన్ జట్టుకు గడ్డు కాలం నడుస్తున్నది. ఇప్పటికే  ఆ దేశంతో సిరీస్ లు ఆడేందుకు ఇతర దేశాలు ముఖం  చాటేస్తుండగా తాజాగా పాక్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు  మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. 

పాకిస్థాన్ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. సోమవారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు ఛాతిలో నొప్పి తీవ్రమవడంతో ఇంజమామ్ ను దవాఖానకు తరలించినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. 51 ఏండ్ల హక్.. గత మూడు రోజులుగా ఛాతిలో నొప్పితో బాధపడుతున్నాడని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని వారు చెప్పారు. నొప్పి అధికమవడంతో ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి యాంజియోప్లాస్టీ నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.

పాక్ తరఫున 120 టెస్టులు ఆడిన ఇంజమామ్.. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కీర్తి సాధించారు. 1991లో అరంగ్రేటం చేసిన ఆయన.. 2007 దాకా క్రికెట్ లో కొనసాగారు. టెస్టుల్లో 8,829 పరుగులు చేశారు. ఇక 375 వన్డేలు ఆడిన ఇంజమామ్.. పాక్ తరఫున హయ్యెస్ట్ పరుగులు (11,701) చేసిన క్రికెటర్ గా చరిత్ర లిఖించుకున్నారు. 2001 నుంచి 2007 దాకా పాక్ జట్టుకు సారథిగా పనిచేశారు. రిటైరయ్యాక 2016 నుంచి 2019 దాకా పాక్ క్రికెట్ టీమ్ కు చీఫ్ సెలెక్టర్ గా కూడా పనిచేశారు. 

కాగా, ఇటీవలే న్యూజిలాండ్ జట్టు ఆఖరు నిమిషంలో  పాక్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని వెళ్లడం.. ఆ వెనువెంటనే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా అదే దారిని అనుసరించడంతో పాక్ క్రికెట్ అభిమానులు  కుంగిపోయారు. తమ దేశానికి ఇక ఏ జట్టు కూడా క్రికెట్ ఆడటానికి రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఇంజమామ్ కు గుండెపోటు రావడంతో పాక్ కు వరుసగా షాక్ లు తగిలినట్టైంది. 

click me!