
భారత్ - దక్షిణాఫ్రికా సంబంధాలు ఇప్పటివి కావు. 1893లో జాతిపిత మహాత్మా గాంధీని పీటర్మరిట్జ్బర్గ్ (సౌతాఫ్రికా) లో రైలు నుంచి కిందకు తోసేసిన దానికంటే ముందే సఫారీలతో మనకు సత్సంబంధాలున్నాయి. గాంధీ రైలు ఉదంతం తర్వాత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించిన ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా ఇండియాతో సన్నిహితంగా మెలిగారు. ఇక క్రికెట్ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్ని సముద్రంలోకి విసిరేసింది. ఐపీఎల్ లో ఇప్పుడున్న పది ఫ్రాంచైజీలలో కనీసం జట్టుకు ఇద్దరు చొప్పున దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఇన్నాళ్లు ఇటువీచిన గాలి.. ఇప్పుడు అటువైపు మళ్లింది. సఫారీ గడ్డ మీద వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కాబోతున్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ) టీ20క్రికెట్ లీగ్ లో ఫ్రాంచైజీల ఓనర్లు కూడా మన బడా బాబులేనట..
అసలు విషయానికొస్తే.. ఐపీఎల్, బీబీఎల్ లు విపరీతంగా ఆదరణ పొందడంతో దక్షిణాఫ్రికా కూడా వారి దేశంలో ఇటువంటి లీగ్ ఒకటి రూపొందించాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో గతంలో ఓ రెండు మూడు సీజన్లపాటునిర్వహించినా అది అంతగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తూ బరిలోకి దిగుతున్నది సీఎస్ఎ.
ఐపీఎల్ లో గతంలో పనిచేసిన వ్యూహకర్తల సహకారంతో సఫారీ క్రికెట్ బోర్డు.. వచ్చే ఏడాది జనవరిలో మరో టీ20 లీగ్ కు తెరలేపింది. ఇందుకుగాను ఆరు ఫ్రాంచైజీలతో అక్కడ టీ20 లీగ్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అయితే ఈ లీగ్ లో ఆరు ఫ్రాంచైజీల ‘వెనుక నిలిచేది’ మన ఐపీఎల్ ఓనర్లేనట.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ యజమానులు సీఎస్ఎ టీ20 లీగ్ లో అక్కడి ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తున్నది.
ఏ జట్లు..? ఎవరెవరు దేనికి..?
సీఎస్ఎ లో ఆరు జట్లున్నాయి. కేప్ టౌన్, జోహన్నస్బర్గ్, ప్రిటోరియా, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, పార్ల్ లు బరిలో ఉన్నాయి. వీటిలో కేప్ టౌన్ కు ముంబై ఇండియన్స్ (అంబానీ), జోహన్నస్బర్గ్ కు చెన్నై సూపర్ కింగ్స్ (ఎన్. శ్రీనివాసన్), ప్రిటోరియాకు ఢిల్లీ క్యాపిటల్స్ (పార్థ్ జిందాల్), డర్బన్ కు లక్నో (సంజీవ్ గొయెంకా), పోర్ట్ ఎలిజిబెత్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ (కళానిది మారన్), పార్ల్ కు రాజస్తాన్ రాయల్స్ (మనోజ్ బదాలే) లు ‘మద్దతు’నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
త్వరలో విడుదల..
సీఎస్ఎ టీ20 లీగ్ కోసం ఇప్పిటకే 29 సంస్థలు బిడ్డింగ్ వేశాయి. బిడ్డింగ్ ప్రక్రియ జులై 13న ముగిసింది. త్వరలోనే బిడ్ లు గెలిచినవారి జాబితా విడుదల కానుంది. దీనిని బట్టి చూస్తే దక్షిణాఫ్రికాలో మినీ ఐపీఎల్ జరుగుతుందనడంలో సందేహమే లేదు.