రిటైర్మెంట్ల పర్వం.. టీమిండియాతో సిరీస్ కు ముందు ఒకే రోజు వెస్టిండీస్ కు డబుల్ షాకులు..

Published : Jul 19, 2022, 10:15 AM IST
రిటైర్మెంట్ల పర్వం.. టీమిండియాతో సిరీస్ కు ముందు ఒకే రోజు వెస్టిండీస్ కు డబుల్ షాకులు..

సారాంశం

West Indies: భారత్ తో సిరీస్ కు ముందు వెస్టిండీస్ జట్టుకు ‘డబుల్ షాక్’ తాకింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 

ప్రపంచ క్రికెట్ లో సోమవారం రిటైర్మెంట్ల పర్వం కొనసాగింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పగా.. భారత్ తో వన్డే సమరానికి సిద్ధమవుతున్న వెస్టిండీస్ జట్టుకు సోమవారం ‘డబుల్ షాక్’ లు తగిలాయి. కరేబియన్ జట్టు వెటరన్ ఆటగాళ్లిద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించినవారిలో ఆ జట్టు  మాజీ సారథి దినేశ్ రామ్దిన్, విధ్వంసక బ్యాటర్ లెండి సిమన్స్ ఉన్నారు. 

2005 నుంచి వెస్టిండీస్ కు ఆడుతున్న దినేశ్ రామ్దిన్.. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు. సోమవారం తన ఇన్స్టా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన రామ్దిన్.. ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు.

రామ్దిన్ తన కెరీర్ లో  74 టెస్టులు,  139 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. 74 టెస్టులలో 2,898  పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 15 అర్థసెంచరీలున్నాయి. 139 వన్డేలలో 2,200 పరుగులు (2 సెంచరీలు) సాధించాడు. మొత్తంగా తన సుదీర్ఘ కెరీర్ లో 5,734 పరుగులు సాధించాడు.  రామ్దిన్ చివరిసారిగా  2019 లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 

 

సిమన్స్ సైతం..

రామ్దిన్ తో పాటు మరో విండీస్ బ్యాటర్ లెండి సిమన్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు  చెప్పేశాడు.  తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సిమన్స్.. చివరిసారిగా  గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడాడు. 2006 లో పాకిస్తాన్ తో వన్డేలో భాగంగా అరంగేట్రం చేసిన సిమన్స్.. వన్డేలు, టెస్టులలో అంతగా రాణించకపోయినా టీ20 లలో మాత్రం స్పెషలిస్టు బ్యాటర్ గా  పేరు తెచ్చుకున్నాడు. ఓపెనర్ గా వచ్చే సిమన్స్ విధ్వంసక బ్యాటర్ గా గుర్తింపు పొందాడు.  విండీస్ తరఫున మొత్తంగా 144 మ్యాచులాడిన సిమన్స్.. 3,763 పరుగులు సాధించాడు. విండీస్ జట్టుతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ  అభిమానులను అలరించాడు.  

 

రెండు ప్రపంచకప్ లలో సభ్యులు..

సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరూ వెస్టిండీస్ జట్టు రెండు సార్లు గెలిచిన  టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యులు కావడం గమనార్హం.  2012, 2016లో ఆ జట్టు  పొట్టి ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. 

ఇక వెస్టిండీస్ జట్టు ఈనెల 22 నుంచి భారత్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు భారత జట్టు ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకుంది. జులై  22, 24, 27 న మ్యాచులు జరుగుతాయి.నికోలస్ పూరన్ సారథ్యంలోని విండీస్.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టును ఎలా ఎదుర్కుంటుదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వన్డే సిరీస్ తర్వాత ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఈ నెలత29 నుంచి ప్రారంభం కానుంది.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే