ఇక టెస్టులు, టీ20లపైనే పూర్తి ఫోకస్... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్...

Published : Jul 18, 2022, 05:39 PM ISTUpdated : Jul 18, 2022, 05:50 PM IST
ఇక టెస్టులు, టీ20లపైనే పూర్తి ఫోకస్... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్...

సారాంశం

వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్... 

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం జో రూట్ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై టీ20, టెస్టులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు బెన్ స్టోక్స్...
 

టీమిండియాతో వన్డే సిరీస్ ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు, సౌతాఫ్రికాతో మంగళవారం తొలి వన్డే ఆడనుంది. ఇదే బెన్ స్టోక్స్‌కి చివరి వన్డే కానుంది. బెన్ స్టోక్స్ ఇప్పటిదాకా 101 వన్డేలు ఆడి,40.43 సగటుతో 2871 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ కారణంగానే ఇంగ్లాండ్ జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో 98 బంతులాడి బెన్ స్టోక్స్, 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  అయితే రెండో పరుగు తీసే సమయంలో న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గుప్లిల్ వేసిన బంతి, బెన్ స్టోక్స్ బ్యాటును తాకుతూ బౌండరీకి దూసుకెళ్లింది. దీనికి అంపైర్లు ఏకంగా 6 పరుగులు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది...

‘డుర్హమ్‌లో నేను ఆఖరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నా. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఇది నిజంగా చాలా కఠినమైన నిర్ణయం. ఇంగ్లాండ్ టీమ్‌తో కలిసి ఆడే ప్రతీ క్షణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశా. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డే ఫార్మాట్‌ని నేను 100 శాతం ఇవ్వలేనని అర్థమైంది. మూడు ఫార్మాట్లు ఆడడం చాలా కష్టంగా మారింది. నా శరీరంపై అదనపు భారం వేయకూడదని తెలుసుకున్నా.. మనది కానిచోట ఉండడమంటే వేరే వారిని చోటు లాక్కోవడమే... 

ఈ 11 ఏళ్లల్లో నాకు వన్డే ఫార్మాట్ ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. గత ఏడేళ్లలో ఎన్నో విజయాలు అందుకున్నాం. నేను ఆడిన 104 వన్డేలను ఎంతగానో ప్రేమించా. ఇంకో మ్యాచ్‌తో వన్డే ప్రస్థానాన్ని ముగించబోతున్నా... నేను తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు స్వాగతిస్తారని అనుకుంటున్నా... మీరు వరల్డ్‌లో బెస్ట్ ఫ్యాన్స్.. సౌతాఫ్రికాపై జరిగే మొదటి వన్డేలో మనం గెలుస్తామనే అనుకుంటున్నా...’ అంటూ సుదీర్ఘ లేఖతో వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు బెన్ స్టోక్స్... 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే