IPL 2024 AUCTION: ఐపీఎల్ 2024 వేలం(IPL 2024 AUCTION)లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
IPL 2024 AUCTION: క్రికెట్ లవర్స్ పండుగ లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. ఇప్పటికే వేలం బరిలో నిలిచే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్‌సీస్ స్లాట్స్ ఉన్నాయి.
ఐపీఎల్ 2024 వేలం(IPL 2024 AUCTION)లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారితో పాటు వికెట్ కీపర్ కేఎస్ భరత్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్పృథ్వీ రాజ్ యర్రా కూడా బరిలో నిలిచారు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కేఎస్ భరత్‌ను ఆ జట్టు వదులుకోవడంతో ఆయన వేలంలో బరిలో నిలిచారు. వీరితో పాటు రోహిత్ రాయుడు, ఎర్రవల్లి అవనీశ్ రావ్, రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి, రవి తేజ, మనీశ్ రెడ్డి, మురుగన్ అభిషేక్, రాహుల్ బుద్దిలు వేలంలో తమ భవిత్వాన్ని పరీక్షించుకోనున్నారు.
హనుమ విహారి తన ఐపీఎల్ కెరీర్ లో 24మ్యాచ్ ఆడి 284 రన్స్ చేశాడు. హనుమ విహారి చివరిగా 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ప్రతీ సీజన్‌లో అతను అన్‌సోల్డ్ ప్లేయర్‌గానే మిగిలిపోతున్నాడు. తాజా వేలంలో విహారి రూ. 50 లక్షల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్నాడు.
ఇక టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.. తన కేరీర్లో 10 ఐపీఎల్ మ్యాచులు ఆడి 199 పరుగులు చేశాడు. తొలుత ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున మ్యాచ్ విన్నింగ్ నాక్ అందరి ద్రుష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. అయితే.. ఆయనకు ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇక గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మారినా.. ఫైనల్ జట్టులో స్థానం దక్కలేదు. ఈ సారి కేఎస్ భరత్ రూ.50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నాడు. ఇక పేసర్ యర్ర పృథ్వీ రాజ్ విషయానికి వస్తే.. గత ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున 2 ఐపీఎల్ మ్యాచ్‌లే ఆడాడు. ఈ సారి అతను రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ సారి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు తెలుగు ఆటగాళ్లు. ఎవరికీ అదృష్టం వరిస్తుందో .. ఐపీఎల్ 2024 వేలం ముగింపు వరకు వేచి ఉండాల్సిందే.