
PBKS vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు రెండు నెలలకు పైగా క్రికెట్ ప్రియులను ఎంటర్టైన్ చేసిన ఈ మెగా టోర్నీలో నేడు (జూన్ 3) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎన్నో మలుపులు, మరెన్నో అడ్డంకులను దాటుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తుది పోరుకు సిద్దమయ్యాయి. రెండు జట్లూ కలల ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచారు.. ఎవరు గెలిచినా ఐపిఎల్ లో చరిత్రే. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా ఒక్క ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. ఏదో ఒక జట్టు కల ఈసారి నెరవేరుతుంది.
అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో సాయంత్రం వర్షం కురిసే అవకాశాలున్నాయట. దీంతో మ్యాచ్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే విజేతలను ఎలా నిర్ణయిస్తారు? అనేగా మీ అనుమానం. దీనిగురించి ఇక్కడ తెలుసుకుందాం.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఐపిఎల్ 2025 ఫైనల్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. మొదటి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు తహతహలాడుతున్నారు. కానీ వారి ఆశలపై వర్షం నీల్లుచల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
చిరుజల్లులు కురిస్తే పరవాలేదు.. కానీ ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. రెండు గంటలకు పైగా వర్షం ఆటకు అంతరాయం కలిగించినా, వర్షం కారణంగా మైదానం మ్యాచ్ ఆడలేని విధంగా తయారయినా రిజర్వ్ డే అంటే మరోరోజు మ్యాచ్ నిర్వహిస్తారు. అంటే జూన్ 4న మ్యాచ్ నిర్వహిస్తారు. కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ... ఇవాళే(మంగళవారం) విజేతలను నిర్ణయిస్తారు.
ఒకవేళ రిజర్వ్ డే అంటే జూన్ 4 కు మ్యాచ్ పోస్ట్ పోన్ అయ్యింది... ఆరోజు కూడా వర్షం కారణంగా నిర్వహించలేని పరిస్థితి వస్తే పాయింట్ టేబుల్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అంటే ఫైనల్లో తలపడే రెండు జట్లలో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ఇలా జరిగితే పంజాబ్ విజేతగా నిలుస్తుంది. అందుకే ఆర్సిబి ఫ్యాన్ వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుకుంటున్నారు.
ఐపిఎల్ 2025 క్వాలిఫయర్ 2 ను ఫాలో అయినవారికి వర్షం పడితే ఏం చేస్తారో అర్థమయి ఉంటుంది. మ్యాచ్ ప్రారంభమవడానికి ముందే వర్షం పడితే దాదాపు రెండుగంటల పాటు వేచిచూస్తారు. 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే చెరో ఐదు ఓవర్లు ఆడించి విజేతను నిర్ణయిస్తారు. ఇదీ సాధ్యంకాకుండా చివరి ప్రయత్నంగా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఈ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం వచ్చేవరకు నిర్వహిస్తారు.
ఇలా ఎంతటి వర్షం కురిసినా విజేతను నిర్ణయించేందుకే ఐపిఎల్ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుంది. మ్యాచ్ నిర్వహణకు అన్నిదారులు మూసుకుపోతేనే పాయింట్స్ టేబుల్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇలా జరగడం అసాధ్యమనే చెప్పాలి... ఒకవేళ జరిగితే ఆర్సిబి బ్యాడ్ లక్.