Latest Videos

IPL 2024 SRH vs RR : రేసులో నిలిచేదెవరు... ఇంటిదారి పట్టేదెవరు ... సన్ రైజర్స్, రాజస్ధాన్ బలాబలాలివే..!! 

By Arun Kumar PFirst Published May 24, 2024, 3:06 PM IST
Highlights

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో మరో ఆసక్తికర పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్దమయ్యాయి. చెపాక్ స్టేడియంలో నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల బలాబలాలు ఓసారి పరిశీలిస్తే.... 

గత రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ ముగియగా నేటితో(శుక్రవారం) ప్లే ఆఫ్ కూడా ముగియనుంది. వచ్చే ఆదివారం అంటే మే 26న ఫైనల్ మ్యాచ్ తో ఈ ఐపిఎల్ సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది. అయితే ఇప్పటికే టోర్నీ మొత్తంలో టాప్ క్లాస్ ఆటతో అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కి దూసుకెళ్లింది. ఈ జట్టుతో తుది పోరులో తలపడే మరో టీం ఏదో నేడు తేలనుంది. ఇవాళ క్వాలిఫయర్ 1 లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్ 2 జరగనుంది. మరికొద్ది గంటల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది... ఇందులో గెలిచే జట్టు టైటిల్ రేసులో నిలుస్తుంది... ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. 

క్వాలిఫయర్ 2 లో  విజయం సాధించాలని ఇటు   హైదరాబాద్  అటు రాజస్థాన్ జట్లు పట్టుదలతో వున్నాయి. ఇరు జట్లు మంచి ఫామ్ లో వున్నాయి  కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చెప్పడం కష్టం. కానీ రెండు జట్ల బలాలేమిటి, బలహీనతలను పోల్చిచూస్తే గెలుపెవరిదో కొంతవరకు  అంచనా వేయవచ్చు. 

సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు, బలహీనతలు :

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బ్యాటింగ్. మరీముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ    క్రీజులో కుదురుకున్నారంటే ఎంతటి స్టార్ బౌలర్ కు అయినా ఊచకోత తప్పదు. లీగ్ దశలో భారీ హిట్టింగ్ తో విరుచుకుపడిన వీరిద్దరు సన్ రైజర్స్ కు విజయాలు అందించారు. హైడ్ 199 స్ట్రైక్ రేట్ తో 533, అభిషేక్  207 స్ట్రైక్ రేట్ తో 470 పరుగులు చేసారు. ఇవాళ కూడా వీరిద్దరు రాణిస్తే రాజస్థాన్ బౌలర్లకు చుక్కలే. 

మిడిల్ ఆర్డర్ లో కూడా హైదరాబాద్ కు మంచి హిట్టర్లు వున్నారు.  క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి లు కూడా ధనాధన్ ఇన్సింగ్స్ ఆడగలరు. ఈ ఇద్దరు కూడా ఈ సీజన్లో మెరుపులు మెరిపిస్తూ ఫామ్ లో వున్నారు. 

ఇక అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ లు కూడా చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక ఇటీవల జట్టులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు కూడా బ్యాటింగ్ చేసే సత్తా వుంది. 

అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్ రైజర్స్ బౌలింగ్ లోనే కాస్త వీక్ గా వుందని చెప్పాలి. కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు భువనేశ్వర్, నటరాజన్ బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే స్థాయిలో వీరెవ్వరి ప్రదర్శన లేదు.  

ఇక మంచి స్పిన్నర్లు లేనిలోటు హైదరాబాద్ టీంలో స్పష్టంగా కనిపిస్తోంది. మయాంక్ మార్కండే, షాబాద్ అహ్మద్ లు స్పిన్ బౌలింగ్ చేస్తున్న ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. 

పూర్తిగా బ్యాటింగ్ పైనే ఆదారపడటం సన్ రైజర్స్ బలహీనత. భారీ స్కోరు సాధించిన సమయంలోనే ఆ జట్టు గెలుస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో హైదరాబాద్ బౌలర్లు విఫలం అవుతున్నారు. క్వాలిఫయర్ 1 లో ఇదే జరిగింది. 

రాజస్థాన్ రాయల్స్ బలాలు, బలహీనతలు : 

ఈ ఐపిఎల్ సీజన్ లో రాజస్థాన్ జట్టు నిలకడగా రాణిస్తోంది. లీగ్ ఆరంభంలో అదరగొట్టినా చివరి దశలో కాస్త తడబడింది ఆర్ఆర్. దీంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో వుంటుందనుకున్న జట్టు కాస్త మూడో స్థానంలో సరిపెట్టుకుంది. అయితే కీలకమైన ప్లేఆఫ్ లో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది. ఇదే ఊపుతో నేడు సన్ రైజర్స్ తో తలపడుతుంది. 

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అద్భుతాలు చేయగల ఆటగాళ్లు రాజస్థాన్ టీంలో వున్నారు. యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. అతడు ఇప్పటివరకు 567 పరుగులు చేసాడు. ఇక మరో యువకెరటం యశస్వి జైస్వాల్ కూడా ఫామ్ ను అందుకున్నాడు. అతడు ఇప్పటివరకు 393 పరుగులు చేసాడు. 

ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా మంచి టచ్ లో వున్నాడు. అతడు 521 పరుగులతో పరాగ్ తర్వాతి స
స్థానంలో నిలిచాడు. హెట్మెయర్, రోవన్ పావెల్ వంటి హిట్టర్లు ఆర్ఆర్ కు బలమే. 

రాజస్ధాన్ స్పిన్ బౌలింగ్ అద్భుతంగా వుంది. రవిచంద్రన్ అశ్విన్, యజువేందర్ చాహల్ వంటి టాప్ స్పిన్నర్లు ఈ టీంలో వున్నారు. ఇక ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ కూడా బౌలింగ్ లో అదరగొడుతున్నారు. 

అయితే రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తో పాటు మరికొందరు ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతుండటం రాజస్థాన్ కు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అలాగే బట్లర్ వంటి స్టార్ ఆటగాడు జట్టుకు దూరమవడం కూడా ఆర్ఆర్ కు దెబ్బే అని చెప్పాలి.  
 

click me!