రాజస్థాన్ రాయల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్... సూర్య హాఫ్ సెంచరీ, సిక్సర్లతో ముగించిన టిమ్ డేవిడ్..
వరుసగా రెండు పరాజయాల తర్వాత ఘనమైన విజయంతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైనా ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ అవుటైనా టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్ల మోత మోగించి మ్యాచ్‌ని ముగించాడు.
ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌ని కొనసాగించిన రోహిత్ శర్మ 5 బంతుల్లో 3 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్.
23 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, అశ్విన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శర్మ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.
చివరి 2 ఓవర్లలో ముంబై ఇండియన్స్ విజయానికి 32 పరుగులు కావాల్సి వచ్చాయి. సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టాడు టిమ్ డేవిడ్. దీంతో ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి..
మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన టిమ్ డేవిడ్, మ్యాచ్‌ని ముగించాడు.14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన తిలక్ వర్మ నాటౌట్‌గా నిలిచారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, యశస్వి జైస్వాల్ సెంచరీ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన జోస్ బట్లర్, మరోసారి నిరాశపరిచాడు..
సంజూ శాంసన్ 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్‌ని పియూష్ చావ్లా క్లీన్ బౌల్డ్ చేశాడు.
9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన జాసన్ హోల్డర్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
3 బంతుల్లో 2 పరుగులు చేసిన ధృవ్ జురెల్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో జైస్వాల్ మాత్రం బౌండరీలతోనే ఢీల్ చేశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్..
సెంచరీ పూర్తయిన తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుస బౌండరీలు బాదాడు. 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో ఫోర్ బాది రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.