లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లో పంజాబ్‌దే గెలుపు.. చెన్నైకి షాకిచ్చిన కింగ్స్

By Srinivas MFirst Published Apr 30, 2023, 7:27 PM IST
Highlights

IPL 2023, CSK vs PBKS: ఐపీఎల్ -16లో మరో హై స్కోరింగ్ థ్రిల్లర్.  చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ లు  చెపాక్ లో మోత మోగించాయి. చివరికి  పంజాబ్ నే విజయం వరించినా  అభిమానులకు  పైసా వసూల్ ఎంటర్‌టైన్మెంట్ దొరికింది. 

ఐపీఎల్ -16 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్  కింగ్స్ మరో అడుగు ముందుకేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తో వారి స్వంత గ్రౌండ్ (చెపాక్) లో ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్ లో పంజాబ్.. 201  పరుగుల విజయలక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది.  భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు  లియామ్ లివింగ్‌స్టోన్ (24 బంతులలో 40, 1 ఫోర్, 4 సిక్సర్లు), ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 42,4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు జితేశ్ శర్మ (10 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (7 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్)  వీరోచితంగా పోరాడి విజయాన్ని అందించారు. ఈ విజయంతో పంజాబ్ ఆర్సీబీని వెనక్కి నెట్టి  ఐదో స్థానానికి దూసుకెళ్లింది. 

డబుల్ సెంచరీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే లో ధాటిగానే బాదింది.  ఓపెనర్లు శిఖర్ ధావన్  (15 బంతుల్లో 28, 4 ఫోర్లు, 1 సిక్సర్),   ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 42,4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే  50 పరుగులు జోడించారు. 

Latest Videos

ఆకాశ్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన ధావన్.. అతడే వేసిన మూడో ఓవర్లో 6,4 బాదాడు. కానీ తుషార్ దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్లో రెండో బాల్ కు పతిరానకు క్యాచ్ ఇచ్చాడు.   ధావన్ స్థానంలో వచ్చిన అథర్వ తైడే  (13)  కూడా ఆకట్టుకోలేదు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన  ప్రభ్‌సిమ్రన్ కూడా జడేజా బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. 

లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 

పంజాబ్ స్కోరు 94-3 గా ఉండగా క్రీజులోకి వచ్చిన  లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్  (20 బంతుల్లో 29, 1 ఫోర్, 1 సిక్స్)లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశారు. ఈ ఇద్దరూ 33 బంతుల్లోన 57  పరుగులు చేశారు. తుషార్ దేశ్‌పాండే వేసిన  16వ ఓవర్లో లివింగ్‌స్టోన్ 6, 6, 4 (బైస్), 6 సాధించాడు.  కానీ ఇదే  ఓవర్లో ఐదో బంతికి అతడు పుల్ షాట్ ఆడగా డీప్ మిడ్ వికెట్ వద్ద  రుతురాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. లియామ్ ప్లేస్ లో వచ్చిన జితేశ్ శర్మ  రాగానే  జడేజా వేసిన 17వ ఓవర్లో ఓ సిక్సర్ బాదాడు.  ఇదే ఓవర్లో కరన్ కూడా సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో 24 పరుగులు రాగా.. జడ్డూ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. 

ఆఖర్లో అదే ఉత్కంఠ.. 

ఇక ఆ జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో  31 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. పతిరాన వేసిన 18వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు కరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్లో 9 పరుగులొచ్చాయి. తుషార్ వేసిన  19వ ఓవర్లో నాలుగో బాల్‌కు ఔట్ అయ్యాడు. ఈ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి.  చివరి ఓవర్లో 9 పరుగులు కావల్సి వచ్చాయి. పతిరాన వేసిన ఆ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సింగిల్ వచ్చింది. రెండో బాల్ కు బైస్ సింగిల్. మూడో బాల్ కు పరుగురాలేదు. నాలుగో బాల్ కు రెండు పరుగులొచ్చాయి. ఐదో బాల్ కు మరో డబుల్. ఆఖరి బంతికి  రజా బ్యాక్‌వర్డ్  స్క్వేర్ లెగ్ దిశగా  ట్రిపుల్ తీసి పంజాబ్  కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. 

టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు.  చెన్నై  ఓపెనర్  డెవాన్ కాన్వే  (52 బంతుల్లో 92 నాటౌట్, 16 ఫోర్లు, 1 సిక్సర్)కు తోడుగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 37,  4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  200 పరుగులు చేసింది.   ధోని ఆఖరి ఓవర్లో వచ్చి రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

click me!