హైదరాబాద్ ఓడింది.. ముంబైనీ ముంచింది.. ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందంజ

Published : May 18, 2023, 11:03 PM ISTUpdated : May 18, 2023, 11:09 PM IST
హైదరాబాద్ ఓడింది.. ముంబైనీ ముంచింది.. ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందంజ

సారాంశం

IPL 2023,  SRH vs RCB: ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ నాలుగేండ్ల తర్వాత  శతకంతో చెలరేగాడు.   కోహ్లీతో పాటు డుప్లెసిస్ ల దూకుడుతో  భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ.. అలవోకగా ఛేదించి  ప్లేఆఫ్స్ రేసులో ముందంజవేసింది. 

ఐపీఎల్‌లో ఉప్పల్  వేదికగా గతంలో ఆడిన ఏడు మ్యాచ్ లలో ఆరింట్లో ఓడిన రికార్డు కలిగిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈసారి మాత్రం  హైదరాబాద్ పై ఆధిపత్యం చెలాయించింది.   ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ను  అలవోకగా గెలుచుకుని  పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.  సన్ రైజర్స్ నిర్దేశించిన  187 పరుగుల లక్ష్యాన్ని.. 19.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి  అందుకుంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (63 బంతుల్లో  100, 12 ఫోర్లు, 4 సిక్సర్లు),  ఫాఫ్ డుప్లెసిస్ (47 బంతుల్లో 71,  7 ఫోర్లు, 2 సిక్సర్లు) లు   సన్ రైజర్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు ఏకంగా 17.5 ఓవర్లలో 172 పరుగులు జోడించి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ విజయంతో   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో  14 పాయింట్లు సాధించి  ముంబైతో సమానంగా నిలిచినా  మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా  రోహిత్ సేనను ఐదో  స్థానానికి నెట్టింది. ఇక ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే   తాము తర్వాత ఆడబోయే హైదరాబాద్ తో మ్యాచ్ లో భారీ  విజయం సాధించడంతో పాటు ఆర్సీబీ.. గుజరాత్ తో  భారీ తేడాతో ఓడిపోవాలి.   

కోహ్లీ - డుప్లెసిస్ షో.. 

హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్ విషయానికొస్తే..  187 పరుగుల లక్ష్య ఛేదనలో బాల్ 1 నుంచి గెలిచేంతవరకూ ఆర్సీబీ జోరు ఎక్కడా తగ్గలేదు.  భువనేశ్వర్ వేసిన  ఫస్ట్ ఓవర్లోనే రెండు బౌండరీలు కొట్టి  జోరు చూపించిన  కోహ్లీ.. తర్వాత అభిషేక్ శర్మ బౌలింగ్ లోనూ ఇదే  సీన్ రిపీట్ చేశాడు.  కార్తీక్ త్యాగి వేసిన నాగులో ఓవర్లో డుప్లెసిస్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. భువీ వేసిన  ఐదో ఓవర్లో 6,4 కొట్టడంతో  ఆర్సీబీ స్కోరు  ఐదు ఓవర్లకే  60  పరుగులకు చేరింది. 

కోహ్లీ - డుప్లెసిస్ లు ఏ మాత్రం తగ్గకపోవడంతో ఆర్సీబీ  స్కోరు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది.  10 ఓవర్లు ముగిసేసరికి  వికెట్ నష్టపోకుండా  95 పరుగులు చేసిన  ఓపెనర్లు గ్లెన్ ఫిలిప్స్ వేసిన  12వ ఓవర్లో  హాఫ్ పెంచరీలు పూర్తి చేసుకున్నారు.  ఈ ఓవర్లో    ఫస్ట్ బాల్ కు  రెండు పరుగులు తీసి  డుప్లెసిస్  34 బంతుల్లో అర్థ  సెంచరీ పూర్తి చేసుకోగా  మూడో బాల్ కు కోహ్లీ ఫోర్ కొట్టి  35 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 

కింగ్ ఆరో సెంచరీ.. 

అర్థ సెంచరీల తర్వాత కూడా జోరు కొనసాగించిన కోహ్లీ, డుప్లెసిస్ లు సన్ రైజర్స్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. భువీ వేసిన 15వ ఓవర్లో  కోహ్లీ.. 4 బౌండరీలు బాది  80లలోకి వచ్చాడు. ఇక నటరాజన్ వేసిన  17వ ఓవర్లో సిక్స్ తో 90లోకి చేరుకున్న ఛేజ్ మాస్టర్..  భువనేశ్వర్ వేసిన   18వ ఓవర్లో  నాలుగో బాల్ కు సిక్సర్ బాది  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ. తద్వారా  అతడు   ఐపీఎల్ లో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఆరు సెంచరీల రికార్డును సమం చేశాడు.  2019 తర్వాత  కోహ్లీకి ఐపీఎల్ లో ఇదే ఫస్ట్ హండ్రెడ్.  కోహ్లీ నిష్క్రమించినా  ఆర్సీబీ విజయం అప్పటికే ఖరారైపోయింది. డుప్లెసిస్ ను కూడా నటరాజన్ ఔట్ చేసినా.. మ్యాక్స్‌వెల్ (5 నాటౌట్), బ్రాస్‌వెల్ (4 నాటౌట్) లు మిగతా పనిని పూర్తి చేశారు. 

అంతకుముందు ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  సన్ రైజర్స్.. హెన్రిచ్ క్లాసెన్  (104) సెంచరీతో చెలరేగడంతో   20 ఓవర్లలో  186 పరుగుల భారీ స్కోరు చేసింది.  కానీ  అతడి కష్టాన్ని  హైదరాబాద్ బౌలర్లు  వృథా చేశారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !