
ఐపీఎల్ -16 లో నిలకడగా ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ శతకంతో చెలరేగాడు. 49 బంతులలోనే 8 బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో క్లాసెన్.. 104 పరుగులు చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్ రైజర్స్.. తన చివరి లీగ్ మ్యాచ్ లో భారీ స్కోరు సాధించేందుకు దోహదపడ్డాడు. క్లాసెన్ సెంచరీ మెరుపులకు తోడు చివర్లో హ్యారీ బ్రూక్ (19 బంతుల్లో 27 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ మరోసారి ఓపెనింగ్ జోడీని మార్చింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మకు తోడుగా రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ కు వచ్చాడు. 14 బంతుల్లో 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను బ్రాస్‌వెల్ ఐదో ఓవర్లో ఔట్ చేశాడు. ఇదే ఓవర్లో మూడో బాల్ కు త్రిపాఠి (15) కూడా ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ మార్క్‌రమ్ (18) తో కలిసిన హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 76 పరుగులు జోడిస్తే ఇందులో మార్క్‌రమ్ చేసినవి 17 పరుగులే అంటే క్లాసెన్ విధ్వంసం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. షాబాజ్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన క్లాసెన్ కర్ణ్ శర్మ వేసిన 11వ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. ఇదే ఓవర్లో ఆఖరి బాల్ కు సింగిల్ తీసిన అతడు 24 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. షాబాజే వేసిన 13వ ఓవర్లో మార్క్‌రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మార్క్‌రమ్ నిష్క్రమించిన తర్వత వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా ధాటిగానే ఆడాడు. కర్ణ్ శర్మ వేసిన 15వ ఓవర్లో.. బ్రూక్ 4, 6 బాదాడు. ఇదే ఓవర్లో క్లాసెన్ కూడా ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో 15 ఓవర్లకే హైదరాబాద్ 130 పరుగుల మార్క్ ను దాటింది. షాబాజ్ వేసిన 17వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన క్లాసెన్.. 90లలోకి వచ్చాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో మూడో బాల్ కు స్ట్రెయిట్ సిక్సర్ బాదిన అతడు.. తన కెరీర్ లో ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇదే ఓవర్లో ఐదో బాల్ కు బౌల్డ్ అయ్యాడు.
క్లాసెన్ వీరవిహారంతో సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు చేసింది.