
ఐపీఎల్ -16 సీజన్ లో సెంచరీల సంఖ్య మరొకటి పెరిగింది. ఈ సీజన్ లో ఫస్ట్ సెంచరీ నమోదుచేసిన హ్యారీ బ్రూక్ తో పాటు ఏడో సెంచరీ చేసిన బ్యాటర్ కూడా సన్ రైజర్స్ నుంచే కావడం విశేషం. ఆర్సీబీ తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో క్లాసెన్ సెంచరీతో చెలరేగాడు. ఈ సెంచరీతో క్లాసెన్ పలు రికార్డులు సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్ ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ వార్నర్ కాగా.. ఇదే ఆర్సీబీపై 2019 లో వార్నర్, బెయిర్ స్టోలు సెంచరీలు చేశారు. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ రూ. 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్.. కోల్కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
బ్రూక్ తర్వాత తాజాగా క్లాసెన్ సెంచరీ బాదడంతో సన్ రైజర్స్ తరఫున సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ గా అతడు నిలిచాడు. ఈ నలుగురూ ఓవర్సీస్ ప్లేయర్లే కావడం గమనార్హం.
ఈ సీజన్ లో క్లాసెన్ నిలకడగా ఆడుతున్నాడు. గత పది ఇన్నింగ్స్ లలో అతడి స్కోర్లు చూస్తే.. 16, 36, 17, 31, 53, 36, 26, 47, 64, 104 గా ఉన్నాయి. ఈ సీజన్ లో ఒక జట్టు తరఫున రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరే ఇతర ఫ్రాంచైజీలలో ఆటగాళ్లు రెండు సెంచరీలు చేయలేదు.