
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ రెండు జట్ల మధ్య కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం అందుకుంది. హారీ బ్రూక్ అజేయ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నితీశ్ రాణా 75, రింకూ సింగ్ 58 పరుగులు చేసినా కోల్‌కత్తా నైట్ రైడర్స్ 205 పరుగులకే పరిమితమై 23 పరుగుల తేడాతో ఓడింది..
ఈ మ్యాచ్ తర్వాత వరుసగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
మరోవైపు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 8 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంటే, 9 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్ మెరుగైన రన్ రేట్ కారణంగా 8వ స్థానంలో ఉంది..
ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవశ్యకం.. కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఓడితే మిగిలిన మ్యాచులతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది..
మయాంక్ అగర్వాల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ వరుసగా విఫలమవుతున్నారు. వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్ ఒక్కడు మాత్రమే వరుసగా అదరగొడుతున్నాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మతో పాటు హెన్రీచ్ క్లాసిన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 197 పరుగుల భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్, 9 పరుగుల తేడాతో విజయం అందుకుంది.. 8 మ్యాచులుగా రిజర్వు బెంచ్‌కే పరిమితమైన కార్తీక్ త్యాగి, నేటి మ్యాచ్‌లో ఆడుతున్నాడు..
బౌలింగ్‌లో మయాంక్ మార్కండే కీలకంగా మారాడు. భువీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు. మరోవైపు కేకేఆర్‌ది కూడా ఇదే పరిస్థితి. వెంకటేశ్ అయ్యర్, రెహ్మనుల్లా గుర్భాజ్, రింకూ సింగ్ బాగానే ఆడుతున్నా విజయాలు మాత్రం రావడం లేదు.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, సునీల్ నరైన్‌లపైనే ఎక్కువగా ఆధారపడింది కేకేఆర్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, హారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్
కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇది: రెహ్మనుల్లా గుర్భాజ్, జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రే రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి