
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతిష్ట మంటగలిపే విధంగా వ్యక్తిగత, పాత పగలతో కొత్త వివాదానికి తెరలేపారు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతం గంభీర్. లక్నో - బెంగళూరు మధ్య మే 1న జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు చాలా మంది ఈ ఇద్దరూ చేసింది తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు, 'India TV' చైర్మెన్, ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ కూడా స్పందించారు.
ఈ వివాదంపై ఆయన తాజాగా ఓ షో లో.. కోహ్లీకి జనాల్లో ఉన్న అభిమానానికి అతడి విజయాలపై గంభీర్ కు అసూయగా ఉందని, అది మొన్న జరిగిన మ్యాచ్ లో మళ్లీ నిరూపితమైందని అన్నారు. ఓ మాజీ క్రికెటర్ గా ఉండి గంభీర్ ఇలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేగాక ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.
రజత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో కొద్దిసేపటికే ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గంభీర్ రజత్ శర్మకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఒత్తిడి’ కారణం చెప్పి అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతున్నాడని గరంగరంగానే ట్వీట్ చేశాడు. ట్వీట్ లో గంభీర్.. ‘ఢిల్లీ క్రికెట్ నుంచి ఒత్తిడి కారణాన్ని చూపిస్తూ తప్పుకున్న వ్యక్తి.. పెయిడ్ పీఆర్, పెయిడ్ వార్తలను వ్యాప్త చేస్తున్నాడు. ఈ కలియుగంలో పారిపోయినవాళ్లే కోర్టులను నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నాడు.
కాగా ఈ ట్వీట్ లో గంభీర్.. రజత్ శర్మ పేరు వాడకపోయినా కౌంటర్ మాత్రం ఆయనకే ఇచ్చాడని దానిని చూస్తేనే తెలుస్తుంది. రజత్ శర్మ గతంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు అధ్యక్షుడిగా నియమితుడై నెల తిరక్కముందే ఈ బాధ్యతలు తాను మోయలేనని ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక కలియుగంలో పారిపోయినవాళ్లే కోర్టులు నడిపిస్తారనేదానికి.. రజత్ శర్మ ఇండియా టీవీలో ‘ఆప్ కి అదాలత్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బోనులో కూర్చోబెట్టి ఆయన ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ షో దేశవ్యాప్తంగా ఫేమస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారే..