
Sunrisers Hyderabad appoint Aiden Markram as captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐసీఎల్-2023) కు ముందు తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడిన్ మార్క్‌రమ్ ను ప్రకటించింది. ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లో చేరాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ ఎవరనేదానిపై చర్చ క్రమంలో యాజమాన్యం తాజా ప్రకటన చేసింది. అంతకుముందు కేన్ విలియంసన్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించారు. అయితే, ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత డీలాపడటంతో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. కేన్ విలియంసన్ రాణించలేకపోవడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంటూ.. కేన్ వేలానికి వదిలేసింది.
ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ గురించి చర్చ మొదలైంది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసిన మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ ఇవ్వబోతున్నారని చర్చ జరిగింది. అయితే, సౌతాఫ్రికా20 లీగ్‌లో మెరుగైన ఆటతీరుతో తన జట్టును ముందుకు నడిపిన అయిడిన్ మార్క్ రమ్ కు యాజమాన్యం ఆరెంజ్ ఆర్మీ పగ్గాలు అప్పగిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
మార్క్ రమ్ సౌతాఫ్రికా20 లీగ్‌లో ఈస్టరన్ కేప్ టీమ్‌ని విజేతగా నిలిపాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ రేసులో ముందుకు వచ్చాడు. సౌతాఫ్రికా లీగ్‌కి ముందు కెప్టెన్‌గా అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో తన జట్టును మార్క్‌రమ్ విజయతీరాలకు చేర్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అయిడిన్ మార్క్‌రమ్ 12 ఇన్నింగ్స్ లలో 139.05 స్ట్రైక్ రేట్ తో 381 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మూడు అర్ధసెంచరీలు బాదిన అతడు జట్టు తరఫున 47.62 సగటుతో రాణించాడు.