
ఐపీఎల్‌లో ప్రకంపనలు సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్పిన్నర్ అజిత్ చండీలా కూడా శిక్ష అనుభవించాడు. స్పాట్ ఫిక్సింగ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న అజిత్ చండీలాపై 2013లో జీవిత కాల నిషేధం విధించింది బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కమిటీ.. తాజాగా ఈ జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
అజిత్ చండీలాతో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు శ్రీశాంత్, అంకీత్ చావన్‌లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్న సమయంలో శ్రీశాంత్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోని క్రికెట్‌కి దూరమయ్యాడు.
ఏడేళ్ల తర్వాత 2021లో తిరిగి కేరళ జట్టు తరుపున సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీతో పాటు రంజీ ట్రోఫీలో ఆడి రీఎంట్రీ ఇచ్చాడు శ్రీశాంత్. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి శ్రీశాంత్ పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. దీంతో వేలానికి షార్ట్ లిస్టు చేసిన ప్లేయర్ల జాబితాలో శ్రీశాంత్‌కి ప్లేస్ దక్కలేదు.
ఐపీఎల్ 2022 సీజన్ ఆడతానని కూడా ప్రకటించిన శ్రీశాంత్, మెగా వేలంలోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో మార్చి 2022లో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు శ్రీశాంత్. 39 ఏళ్ల అజిత్ చండీలా కూడా తనపై బ్యాన్ ఎత్తివేయడంతో తిరిగి దేశవాళీ టోర్నీల్లో ఆడి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం..
అలాగే అంకిత్ చావన్‌పై విధించిన లైఫ్ టైమ్ బ్యాన్‌ని జూన్ 2021న ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇది జరిగిన ఏడాదిన్నరకి ఈ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా గుర్తించిన అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు మారుస్తూ నిర్ణయం ప్రకటించింది. 2013 నుంచి ఈ నిషేధం అమలులో ఉండడంతో ఇప్పటికే అజిత్ చండీలాపై బ్యాన్ కాలం ముగిసిపోయినట్టే...
2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ కోసం బుకీల నుంచి రూ.4.9 మిలియన్లు తీసుకున్నట్టు అజిత్ చండీలాపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో రూ.15 లక్షలు, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ చేయడానికి ఇచ్చినట్టు తేలింది. దీంతో మే 17, 2013న అజిత్ చండీలాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న అజిత్ చండీలాపై సస్పెన్షన్ వేటు వేసింది ఆ కంపెనీ..
స్పాట్ ఫిక్సింగ్ అరెస్ట్ కావడానికి ముందు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 9 లిస్టు ఏ మ్యాచులు, 28 టీ20 మ్యాచులు ఆడిన అజిత్ చండీలా, ఓవరాల్‌గా 34 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 200లకు పైగా పరుగులు చేశాడు.