బౌలర్లూ.. ‘ఎక్స్‌ట్రా’లు తగ్గించుకోండయ్యా.. ఐపీఎల్‌లో సారథులకు కొత్త తలనొప్పి..!

By Srinivas MFirst Published Apr 5, 2023, 3:56 PM IST
Highlights

IPL 2023: ఐదు రోజుల క్రితం మొదలైన  ఐపీఎల్ లో కెప్టెన్లకు  గెలుపోటములు,  ఇంపాక్ట్ ప్లేయర్ల కంటే  మరో  దిగులు పట్టుకుంది. బౌలర్ల ‘ఎక్స్‌ట్రా’ల వల్ల జట్లు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాయి. 

టీ20 మ్యాచ్ లలో   బ్యాటర్లకు ఎంత  ప్రాముఖ్యం ఉందో  అంతే సమానంగా  బౌలర్లకూ  ఉంది. ‘ముఖ్యంగా టీ20లలో  నోబాల్స్ వేయడం అది  నేరం’వంటిదేనని  క్రీడా విశ్లేషకులు  పలుమార్లు  హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.  నోబాల్స్ తర్వాత ఫ్రీ హిట్ ల వల్ల జట్లు ప్రత్యర్థులకు అదనంగా పరుగులు ఇవ్వాల్సిన పరిస్థితే ఇందుకు కారణం. ఇలా నోబాల్స్ , వైడ్స్ రూపంలో ధారాళంగా పరుగులిచ్చుకోవడం కచ్చితంగా ఆందోళనకరమే.  

బౌలర్లు ఈ నోబాల్స్, వైడ్స్ ద్వారా భారీగా పరుగులిచ్చుకోవడం పై రెండ్రోజుల క్రితం  చెన్నై సూపర్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో  సీఎస్కే సారథి  ధోని మాట్లాడుతూ.. ‘బౌలర్లు నోబాల్స్ వేయకూడదు. వైడ్స్ తక్కువగా వేయాలి.  ఈ మ్యాచ్ లో మేం  ఎక్కువగా అదనపు డెలివరీలు వేశాం...

Latest Videos

బౌలర్లు వాటిని తగ్గించాలి. లేకుంటే వాళ్లు  కొత్త  కెప్టెన్ నేతృత్వంలో  ఆడాల్సి ఉంటుంది. ఇది వాళ్లకు నా రెండో హెచ్చరిక’అని  చెప్పాడంటేనే కెప్టెన్లు ఈ విషయంలో ఎంతలా దిగులు చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లోఇంతవరకూ జరిగినవి ఏడు మ్యాచ్ లే అయినా..  వివిధ జట్లు  అదనపు పరుగుల రూపంలో ఇప్పటికే ఏకంగా 93 పరుగులు సమర్పించుకున్నాయంటే  బౌలర్లు ఎంతలా లయ తప్పుతున్నారనేది   స్పష్టంగా తెలుస్తూనే ఉంది. 

ఆ వివరాలివిగో.. 

- గుజరాత్ - చెన్నై  మ్యాచ్ లో  జీటీ బౌలర్లలో షమీ ఒక నో బాల్ వేయగా  చెన్నై బౌలర్లైతే  రెండో నోబాల్స్, నాలుగు వైడ్స్ వేశారు. 

- పంజాబ్ - కోల్కతా మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లు రెండు వైడ్స్ వేయగా.. ఒక నోబాల్ కూడా  వేశారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్  రెండు నోబాల్స్ వేయగా  సికిందర్ రజ ఒక వైడ్ విసిరాడు. 

- ఢిల్లీ -  లక్నో మ్యాచ్ లో  ఢిల్లీ బౌలర్లు ఐదు వైడ్స్  వేశారు.  లక్నో బౌలర్లు అయితే   ఏకంగా 9 వైడ్స్ ఒక నోబాల్ వేశారు. ఇందులో  జయదేవ్ ఉనద్కత్ ఒక్కడే  ఆరు వైడ్స్ విసరడం గమనార్హం.  

- ఎస్ఆర్‌హెచ్ - రాజస్తాన్ మ్యాచ్ లో భాగంగా హైదరాబాద్ బౌలర్లు రెండు వైడ్స్ వేయగా..   రాజస్తాన్ బౌలర్లు  మూడు నోబల్స్, మూడు వైడ్స్ వేశారు.  ఈ మూడు నోబాల్స్  ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన  నవ్‌దీప్ సైనీ వేసినవే. 

- ఆర్సీబీ - ముంబై తో మ్యాచ్ లో అయితే  బెంగళూరు బౌలర్లు  పది వైడ్లు విసిరారు.  ఇందులో మొన్నటిదాకా వన్డేలలో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ గా ఉన్న సిరాజ్ వేసినవే ఆరు ఉండటం గమనార్హం.   హర్షల్ పటేల్ ఓ నోబాల్ కూడా వేశాడు. ముంబై బౌలర్లలో  సూర్య ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన   జేసన్ బెహ్రాండార్ఫ్.. నాలుగు వైడ్స్ వేశాడు. 

- చెన్నై -లక్నో మ్యాచ్ లో   భాగంగా లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ ఒక్కడే ఐదు వైడ్లు వేయగా   మేయర్స్, రవి బిష్ణోయ్ తలా ఓ వైడ్ విసిరారు.  యశ్ ఠాకూర్   ఓ నోబాల్ విసిరాడు. ఇక ఇదే మ్యాచ్ లో చెన్నై బౌలర్లు  ఎక్స్‌ట్రాల రూపంలోనే 18 పరుగులివ్వడంపై సీఎస్కే  సారథి  ధోని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు.   దీపక్ చహర్ ఐదు వైడ్స్, తుషార్ దేశ్‌పాండే నాలుగడు, మోయిన్ అలీ 1, రాజవర్ధన్ మూడు వైడ్స్ వేశారు. ఇదే మ్యాచ్ లో  తుషార్.. 3 నోబాల్స్ వేశాడు.  

 

MS Dhoni interview is amazing!

Warning ⚠️ for the blower for blowing the No- balls & wide needs control or need to play under different Captain! 😁 pic.twitter.com/uJXWbqxjRT

— @Cricket Vibes (@DrYDV100)

- ఢిల్లీ - గుజరాత్ మ్యాచ్ లో  సీనియర్ పేసర్ షమీ అయితే  ఏకంగా పది పరుగులు వైడ్స్ రూపంలోనే సమర్పించుకున్నాడు.   అల్జారీ జోసెఫ్ కూడా ఓ వైడ్ వేశాడు.  ఢిల్లీ బౌలర్లలో నోర్జే తప్ప మిగిలిన నలుగురు బౌలర్లు నాలుగు వైడ్స్ వేశారు.  కానీ నోర్జే  రెండు నోబాల్స్ విసిరాడు. 

click me!