
టీమిండియా పేసర్, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్.. భాగ్యనగరంలో నిర్మించుకున్న కొత్త ఇంటికి ఆర్సీబీ ఆటగాళ్లను ఆహ్వానించాడు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో సహా ఆ జట్టు ఆటగాళ్లు సిరాజ్ కొత్త ఇంటికి వచ్చి కాసేపు ఇక్కడే గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
2017 నుంచి జాతీయ జట్టుతో ఉన్న సిరాజ్ ఆస్ట్రేలియాలో 2020 - 21 లో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తో వెలుగులోకి వచ్చాడు. కంగారూలను వారి స్వంత దేశంలో ఢీకొట్టడంలో భారత జట్టులో సిరాజ్ ది కీలక పాత్ర. ఇక ఆ సిరీస్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
టీమిండియాలోకి రాకముందు.. వచ్చిన తర్వాత చాలాకాలం పాటు హైదరాబాద్ లోని పాతబస్తీలోనే ఉన్న సిరాజ్ కుటుంబం ఇటీవలే జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్‌నగర్ లో కొత్త ఇంటిని నిర్మించుకుంది. గడిచిన ఐదేండ్లుగా భారత జట్టులో ఉన్న సిరాజ్.. జాతీయ జట్టు కాంట్రాక్టులతో పాటు ఐపీఎల్ లో కూడా బాగానే సంపాదిస్తుండటంతో సిరాజ్ కొత్త ఇంటికి శ్రీకారం చుట్టాడు. కాగా ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే ఆడనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న ఆర్సీబీ.. సిరాజ్ ఇంటికి వచ్చి ఇక్కడ సందడి చేసింది. ఈ సందర్భంగా సిరాజ్ కుటుంబం.. ఆర్సీబీ టీమ్ కు స్పెషల్ హైదరాబాద్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేసింది.
విరాట్ కోహ్లీని అమితంగా ఇష్టపడే సిరాజ్.. తన హాల్ లో కోహ్లీతో ఉన్న ఫోటోతో పాటు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఫోటోను తన హాల్ లో అలంకరించాడు. అంతేగాక మరోవైపు తాను తీసుకున్న అవార్డులు, కోహ్లీ తనకు గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాట్ ను ప్రత్యేకంగా దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఐపీఎల్-16 సీజన్ లో సిరాజ్.. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే లో త్వరగా వికెట్లు పడగొడుతూ ఆర్సీబీకి మంచి బ్రేక్ లు ఇస్తున్నాడు. కాగా ఈనెల 18న బెంగళూరు.. హైదరాబాద్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్ అవకాశాలుంటాయి.