
ఐపీఎల్-16లో భాగంగా ప్లేఆఫ్స్ రేసుకు సిద్ధమవుతున్నది ముంబై ఇండియన్స్. నేటి రాత్రి ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక పోరు ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ క్రమంలో లక్నోకు వెళ్లిన ముంబై టీమ్ లో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. తనకు కుక్క కరిచిందని, లక్నోకు వచ్చే ముందే ఇలా జరిగిందని చెప్పాడు.
లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన ఓ వీడియో లో.. అర్జున్ ను యుధ్వీర్, మోహ్సిన్ ఖాన్ కలుసుకున్నారు. అర్జున్ ను అలింగనం చేసుకున్న యుధ్వీర్.. ‘ఇంకేంటి. అంతా ఓకేనా..? అని అడిగాడు. దానికి అర్జున్.. తన ఎడమ చేతిని చూపిస్తూ.. ‘కుక్క కరిచింది’అని చెప్పాడు.
అప్పుడు యుధ్వీర్.. ‘కుక్కా.. ఎప్పుడు..?’అని ప్రశ్నించాడు. దానికి అర్జున్.. ‘ఇక్కడకు వచ్చేముందే..’ అని చెప్పాడు. ఆ వెంటనే మోహ్సిన్ ఖాన్ కూడా వచ్చి అర్జున్ ను హగ్ చేసుకుని క్షేమ సమాచారాలు అడిగాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ లక్నో.. ‘ముంబై సే ఆయా మేరే దోస్త్..’అని కామెంట్ చేసింది.
కాగా ఈ సీజన్ లోనే కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. నాలుగు మ్యాచ్ లు ఆడాడు. నాలుగు మ్యాచ్ లలో 3 వికెట్లు తీశాడు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో అర్జున్.. భువనేశ్వర్ వికెట్ తీశాడు. కానీ తర్వాత పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో భారీగా పరుగులివ్వడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని పక్కనబెట్టింది.
వధెరాకు వెరైటీ శిక్ష..
ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ నెహల్ వధెరకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఓ వైరెటీ శిక్ష విధించింది. లక్నోతో మ్యాచ్ కోసం అతడు ముంబైలో తాము ఉంటున్న టీమ్ హోటల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ప్యాడ్స్ కట్టుకుని వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వధెర ఇటీవలే ముంబై జట్టు లక్నోకు వెళ్లడానికి ముందు నిర్వహించిన టీమ్ మీటింగ్ కు లేట్ గా వచ్చాడట. దీంతో టీమ్ మేనేజ్మెంట్ అతడికి ఈ శిక్ష విధించినట్టు ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. వధెర ఈ సీజన్ లో ముంబై మిడిలార్డర్ లో కీలకంగా మారాడు.