అస్సాం ట్రైన్ ఎక్కాలనే తొందర్లో సన్ రైజర్స్‌కు భారీ ఓటమి.. ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్

Published : May 15, 2023, 11:26 PM IST
అస్సాం ట్రైన్ ఎక్కాలనే తొందర్లో సన్ రైజర్స్‌కు భారీ ఓటమి.. ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్

సారాంశం

IPL 2023, GT vs SRH: ఐపీఎల్ -16 లో ప్లేఆఫ్స్ ఆశలు అస్సలు లేకున్నా  ఏదో పరువు కోసమైనా ఆడతారనుకున్న హైదరాబాద్ అభిమానులకు  సన్ రైజర్స్ ఆట మరోసారి కోపం తెప్పించింది. 

‘ఏమో గుర్రమెగరావచ్చు..’ అని గంపెడాశలతో   ఉన్న సన్ రైజర్స్ అభిమానులకు హైదరాబాద్ ఆటగాళ్లు.. ‘అబ్బే, మేం మారం.. మేమింతే, మా ఆటింతే..’ అని మరోసారి ఘనంగా చాటి చెప్పారు. తమకంటే ముందే  ఢిల్లీ క్యాపిటల్స్  అస్సాం ట్రైన్ ఎక్కడాన్ని జీర్ణించుకోలేని  ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు   లేట్ అయితే  స్లీపర్‌ కోచ్‌లో ఖాళీలు దొరుకుతాయో లేవోననే తొందర్లో మరీ తొందరపడి గుజరాత్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో 9 వికెట్లు కోల్పోయి  154 పరుగులకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్ల విజృంభణతో ఆ  జట్టు..   34 పరుగుల తేడాతో గెలుపొంది  9 విజయాలు, 18 పాయింట్లతో ఈ సీజన్ లో అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ  ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన మొదటి టీమ్ ‌గా నిలిచింది.  

భారీ లక్ష్య ఛేదనలో 49 పరుగులకే సగం మంది  బ్యాటర్లు క్రీజులోకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లినట్టుగా  ఆడటంతో సన్ రైజర్స్  కథ ముగిసింది. కానీ  హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 64, 4  ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకోవడంతో   మరీ  చెత్త స్కోరుకు  ఆలౌట్ అయ్యే రికార్డు తప్పింది. 

పవర్ ప్లే లోనే  ఖతం..

చేయాల్సిన లక్ష్యం  190  పరుగులు.  అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మలు సన్ రైజర్స్ ఓపెనర్లు.  గుజరాత్ కు షాకివ్వపోతారా అని ఓ ఆశ. కానీ ఇది  భ్రమే అని  తేల్చి చెప్పాడు షమీ. అతడు వేసిన ఫస్ట్ ఓవర్ లోనే  అన్మోల్ ప్రీత్  (5)  రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో రింకూ సింగ్ ఐదు సిక్సర్లు బాదిన తర్వాత మళ్లీ  మ్యాచ్ ఆడుతున్న యశ్ దయాల్  వేసిన రెండో ఓవర్లో అభిషేక్ శర్మ (4) సాహాకు క్యాచ్ ఇచ్చాడు. షమీ  మూడో ఓవర్లో.. త్రిపాఠి  (1)ని ఔట్ చేసి ఐదో ఓవర్లో మార్క్‌రమ్  (10) ను పెవిలియన్ కు పంపాడు. మోహిత్ శర్మ వేసిన  ఏడో ఓవర్లో  సన్వీర్ సింగ్  (7) సాయి సుదర్శన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో నాలుగో బాల్ కు అబ్దుల్ సమద్ (4) కూడా  తన కొలిగ్స్ బాటే నడిచాడు.  ఫలితంగా  హైదరాబాద్  7 ఓవర్లకు 50-6  గా  నిలిచింది. 

ఆదుకున్న క్లాసెన్.. 

అత్యంత దారుణ పరాజయం తప్పదనుకున్న  సన్ రైజర్స్ ఆ మాత్రం స్కోరు చేసిందంటే దానికి కారణం  క్లాసెన్. ఈ సీజన్ లో నిలకడగా ఆడుతున్న క్లాసెన్.. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. మార్కో జాన్సెన్   (3) విఫలమైనా  భువనేశ్వర్ కుమార్ (26 బంతుల్లో 27, 3 ఫోర్లు) తో  కలిసి  సన్ రైజర్స్ స్కోరును 100 దాటించాడు.   ఈ ఇద్దరూ  8వ వికెట్ కు 68 పరుగులు జోడించారు.  

నూర్ అహ్మద్  వేసిన  11, 13వ ఓవర్లలో  రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన  క్లాసెన్..  రషీద్ ఖాన్ వేసిన  14వ ఓవర్లో  ఆఖరి బంతికి సింగిల్ తీసి అర్థ  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఐపీఎల్ -16 లొ అతడికి ఇది రెండో అర్థ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత క్లాసెన్.. షమీ వేసిన   17వ ఓవర్లో  మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  గుజరాత్ బౌలర్లలో  షమీ, మోహత్ శర్మ లు తలా నాలుగు వికెట్లు తీశారు. యశ్ దయాల్ ఒక వికెట్ తీశాడు.  

అంతకుముందు గుజరాత్  ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్..  58 బంతుల్లో   13 బౌండరీలు, ఓ  సిక్సర్ సాయంతో   101 పరుగులు చేయగా   సాయి సుదర్శన్.. 47 పరుగులతో రాణించాడు.  ఈ ఇద్దరూ తప్పితే గుజరాత్ లో కూడా డబుల్ డిజిట్ స్కోరు చేసిన నాథుడే లేడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు