
చెన్నై చెపాక్ వేదికగా సీఎస్కే - ఎస్ఆర్‌హెచ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కోపమొచ్చింది. క్యాచ్ పట్టకుండా అడ్డుకున్నాడని జడేజా.. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాచ్ పట్టనివ్వనందుకు అతడిపై అసహనం వ్యక్తం చేస్తూ ‘అసలు ఎందుకు నన్ను అడ్డుకున్నావ్..?’ అంటూ కోపంగా చూశాడు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్డూ వేసిన 14వ ఓవర్లో సన్ రైజర్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నాడు. ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ ను మయాంక్ స్ట్రైయిట్ షాట్ ఆడాడు.
బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న క్లాసెన్ దిశగా వెళ్లింది. జడేజా కూడా క్యాచ్ అందుకునేందుకు పక్కకు జరిగాడు. కానీ జడేజా అటుగా వస్తున్న విషయం చూసుకోని క్లాసెన్ కూడా తాను ఉన్న చోటు నుంచి పక్కకు జరిగాడు. దీంతో ఇద్దరూ ఢీకొన్నారు. అప్పుడు జడ్డూ.. కింద పడిపోయి అసహనంగా క్లాసెన్ పై ‘ఏంటి నువ్వు..? ఇటు ఎందుకు వచ్చావ్..?’ అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా హెన్రిచ్ తెలిసో తెలియకో మయాంక్ అగరర్వాల్ ను రక్షించాడు. కానీ ఈ అవకాశాన్ని మయాంక్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇదే ఓవర్లో ఐదో బంతికి ముందుకొచ్చి ఆడబోయాడు. కానీ బాల్ మిస్ అయింది. వెనకాల ఉన్న ధోని మాత్రం మిస్ కాలేదు. మయాంక్ తేరుకునే లోపే బెయిల్స్ ఎగిరాయి. మయాంక్ నిష్క్రమించిన తర్వాత కూడా జడ్డూ - క్లాసెన్ వైపు తిరిగి ఏదో అనబోయాడు. కానీ ధోని, ఇతర ఆటగాళ్లు వచ్చి అతడిని వారించడంతో గొడవ సద్దుమణిగింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ (34) టాప్ స్కోరర్. హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్ లు మరో చెత్త ప్రదర్శనతో విసిగించారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైని ఈ స్కోరు కొట్టకుండా డిఫెండ్ చేయాలంటే సన్ రైజర్స్ బౌలింగ్ లో అద్బుతమే చేయాలి. చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరనలు తలా ఓ వికెట్ పడగొట్టారు.