IPL 2023, CSK vs SRH: మళ్లీ విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్లు.. చెపాక్‌లో ఈ స్కోరు ఏ మూలకు..?

Published : Apr 21, 2023, 09:08 PM IST
IPL 2023, CSK vs SRH: మళ్లీ విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్లు.. చెపాక్‌లో ఈ స్కోరు ఏ మూలకు..?

సారాంశం

IPL 2023:  ఐపీఎల్ -16లో చెన్నై సూపర్ కింగ్స్  సూపర్ బౌలింగ్ ధాటికి  సన్ రైజర్స్ బ్యాటర్లు దాసోహమయ్యారు.   చేతగాని ఆటతీరుతో మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. చెపాక్ లో  ఈ స్కోరుతో చెన్నైని నిలువరించాలంటే అది అద్భుతమే. 

సన్ రైజర్స్ మారలేదు.  మారే ఉద్దేశం కూడా తమకు లేదన్నట్టుగా  మరో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచింది.  చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ తో  జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ  (34) టాప్ స్కోరర్. హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్ లు మరో చెత్త ప్రదర్శనతో విసిగించారు.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్..  ఈసారి మరో కొత్త జోడీతో బరిలోకి దిగింది. హ్యరీ బ్రూక్  కు  జోడీగా అభిషేక్ శర్మ వచ్చాడు.   జోడీలు మారినా  సన్ రైజర్స్ రాత మారలేదు.  13 బంతులాడి  3 ఫోర్లు కొట్టిన  బ్రూక్.. ఆకాశ్ సింగ్ వేసిన ఐదో  ఓవర్లో రెండో బంతికి  కట్ షాట్ ఆడబోయి  షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

ఓపెనర్ గా వచ్చిన  అభిషేక్ శర్మ.. 26 బంతుల్లో  3 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో  34 పరుగులు చేసి  కుదురుకున్నట్టే కనిపించాడు. రాహుల్ త్రిపాఠితో కలిసి రెండో వికెట్ కు 31 పరుగులు జోడించాడు.   కానీ రవీంద్ర జడేజా వేసిన  పదో ఓవర్ రెండో బంతికి అజింక్యా రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

ఆ నలుగురూ టపటప.. 

71కే రెండు వికెట్లు పడ్డా  సన్ రైజర్స్ అభిమానులు రాహుల్ త్రిపాఠి,  కెప్టెన్ మార్క్‌రమ్ నిలుస్తారని భావించారు.  కానీ  21 బంతుల్లో 21 పరుగులే చేసిన త్రిపాఠిని జడేజా 12వ ఓవర్లో  రెండో బాల్ కు ఔట్ చేశాడు.   ఆ కొద్దిసేపటికే  మార్క్‌రమ్ (12)   తీక్షణ బౌలింగ్ తో  ధోనికి క్యాచ్ ఇచ్చి  నిష్క్రమించాడు.   మిడిలార్డర్ లో వచ్చిన  మయాంక్ అగర్వాల్.. 2 పరుగులే చేసి  జడేజా బౌలింగ్ లోనే ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు.  కొద్దిసేపు  క్రీజులో నిలబడ్డ హెన్రిచ్ క్లాసెన్   (17) కూడా మతిరన వేసిన   18వ ఓవర్లో  మూడో బాల్ కు రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు.  

 

డెత్ ఓవర్లలో  అప్పటికే ప్రధాన బ్యాటర్లంతా  పెవిలియన్ చేరడంతో  మార్కో జాన్సెన్  (17 నాటౌట్ ), వాషింగ్టన్ సుందర్ (9) లు వచ్చినా వాళ్లు  కూడా ఏమంత ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా  సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  134 పరుగులకే పరిమితమైంది. మరి  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న  చెన్నైని ఈ స్కోరు కొట్టకుండా డిఫెండ్ చేయాలంటే సన్ రైజర్స్ బౌలింగ్ లో అద్బుతమే చేయాలి. చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా  తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరనలు తలా ఓ వికెట్ పడగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

అయ్యో భగవంతుడా.! కావ్య పాప ఇలా చేశావేంటి.. ఈసారి కూడా కప్పు పాయే
T20 World Cup : సంజూ vs గిల్.. భారత జట్టులో చోటుదక్కేది ఎవరికి?