
ఐపీఎల్-2023లో రెండు ఓటముల తర్వాత పుంజుకున్నట్టే కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటీవలే ఉప్పల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి మళ్లీ అపజయాల బాట పట్టింది. నేడు ఆ జట్టు.. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని సేన ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ కు రానుంది.
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ దిశగా ముందుకు సాగాలని భావిస్తున్నది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ధోని సేన.. మూడింట్లో విజయాలు సాధించి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. వరుసగా విఫలమవుతున్న సన్ రైజర్స్ ను మరోసారి మెరీనా బీచ్ లో ముంచేందుకు చెన్నై గ్యాంగ్ రెడీ అయింది.
అయితే ముంబై తో మ్యాచ్ లో విజయం కోసం పోరాడినా ఆఖర్లో వికెట్లు కోల్పోయి అపజయం పాలైన మార్క్‌రమ్ సేన నేటి మ్యాచ్ లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తున్నది. బ్యాటింగ్ వైఫల్యాలే సన్ రైజర్స్ ను నిండా ముంచుతున్నాయి. కోల్కతాతో సెంచరీ చేసిన ఓపెనర్ హ్యారీ బ్రూక్ మొన్న ముంబైలో మళ్లీ విఫలమయ్యాడు. కేకేఆర్ తో స్పిన్ ఆడేప్పుడు ఇబ్బందులు పడ్డ అతడు స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ లో ఏ మేరకు రాణిస్తాడన్నది ఆసక్తికరం. త్రిపాఠి పంజాబ్ తో మ్యాచ్ లో మెరిసినా తర్వాత విఫలమయ్యాడు. మార్క్‌రమ్ రాణిస్తున్నా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. మరి నేటి మ్యాచ్ లో అయినా సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ కుదుటపడుతుందో చూడాలి.
రికార్డులు వాళ్ల వైపే..
ఐపీఎల్ లో ఇప్పటివరకు సీఎస్కే - ఎస్ఆర్‌హెచ్ మధ్య 19 మ్యాచ్ లు జరగగా అందులో చెన్నైదే పైచేయిగా ఉంది. చెన్నై ఏకంగా 14 మ్యాచ్ లలో గెలవగా సన్ రైజర్స్ ఐదింటిలోనే విజయాలు సాధించింది. చెపాక్ లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరుగగా మూడింట్లోనూ హైదరాబాద్ ఓడింది.
తుది జట్లు :
సన్ రైజర్స్ హైదరాబాద్ : హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ , మయాంక్ మార్కండే
చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, మతీష పతిరన, ఆకాశ్ సింగ్