కేకేఆర్ బౌలర్లపై పంజా విసిరిన పంజాబ్.. కోల్కతా ఎదుట భారీ లక్ష్యం..

By Srinivas MFirst Published Apr 1, 2023, 5:15 PM IST
Highlights

PBKS vs KKR IPL 2023 Live: ఐపీఎల్ -16 సీజన్ లో  భాగంగా ఆడుతున్న తొలి మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. మొహాలీలో  ఫోర్లు, సిక్సర్ల మోత మోగించింది. 

కొత్త సారథి శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ -16లో భాగంగా ఆడుతున్న తొలి మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా అదరగొట్టింది.  మొహాలీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5  వికెట్లు కోల్పోయి  191 పరుగులు చేశారు. భానుక రాజపక్స (50, 32 బంతుల్లో , 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో రాణించాడు. 

మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి  బ్యాటింగ్ కు  వచ్చిన ధావన్ సేనకు ఓపెనర్  ప్రభ్‌సిమ్రన్ సింగ్  (23, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)   మెరుపు ఆరంభాన్నిచ్చాడు.  ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ తో పాటు సౌథీ వేసిన రెండో ఓవర్ నూ అతడే ఆడాడు. తొలి ఓవర్లో  ఒక సిక్స్ కొట్టిన  అతడు.. సౌథీ వేసిన ఓవర్లో   4,4,6 బాదాడు.  కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి  వికెట్ కీపర్  గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

భానుక బాదుడు.. 

రెండో స్థానంలో వచ్చిన  భానుక రాజపక్స.. శిఖర్ ధావన్ (40,  29 బంతుల్లో..  6 ఫోర్లు)  తో కలిసి  రెండో వికెట్ కు 56 బంతుల్లోనే  86 పరుగులు జోడించాడు.  సునీల్  నరైన్ వేసిన  ఐదో ఓవర్లో రాజపక్స.. 4, 4, 6 కొట్టాడు. శార్దూల్ ఠాకూర్    వేసిన ఏడో ఓవర్లో కూడా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు.   30 బంతుల్లోనే అర్థం సెంచరీ పూర్తి చేసుకున్న  భానుక..   ఉమేశ్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో  ఆఖరి బంతికి    రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

భానుక ప్లేస్ లో వచ్చిన   జితేశ్ శర్మ  (21, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)  మెరుపులు మెరిపించాడు.  సౌథీ వేసిన   14వ ఓవర్లో  రెండో బంతికి సిక్సర్ బాదిన  జితేశ్.. అదే ఓవర్లో   మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి  ఉమేశ్ యాదవ్ చేతికి చిక్కాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ధావన్ ను వరుణ్ చక్రవర్తి.. 15వ ఓవర్లో  మూడో బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు.   

చివర్లో తగ్గిన దూకుడు.. 

తన కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న జింబాబ్వే ఆటగాడు సికందర్ రజ (13, 16 బంతుల్లో.. 1 ఫోర్, 1 సిక్సర్),  ఇంగ్లాండ్ ఆల్ రౌండర్  సామ్ కరన్ (26, 17 బంతుల్లో, 2 సిక్సర్లు)  లు ఐదో వికెట్ కు 25 పరుగులు జోడించారు.  ధావన్, భానుక నిష్క్రమించాక  పంజాబ్ దూకుడు కాస్త తగ్గింది.  15 వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకూ   కేకేఆర్ బౌలర్లు పంజాబ్ ను కాస్త కట్డడి చేశారు. ఈ ఐదు ఓవర్లలో  పంజాబ్ 34 పరుగులే చేయగలిగింది. సౌథీ వేసిన చివరి ఓవర్లో  15 పరుగులు రావడంతో  కేకేఆర్ స్కోరు 190  మార్క్ దాటింది. 

కేకేఆర్ బౌలర్లలో శఆర్దూల్ భారీగా పరుగులిచ్చుకున్నాడు.  4 ఓవర్లు వేసిన శార్దూల్ .. ఒక్క వికెట్ కూడా తీయకున్నా  43 పరుగులిచ్చాడు.  ఉమేశ్ యాదవ్ , సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలకు తలా ఒక వికెట్ దక్కింది. టిమ్ సౌథీ.. రెండు వికెట్లు పడగొట్టాడు. 

click me!