
ప్రతి సీజన్ కూ సారథిని మార్చే జట్టు ఒకవైపు.. గాయాలతో కెప్టెన్ దూరం కావడంతో తాత్కాలిక సారథితో నెట్టుకొస్తున్న జట్టు మరో వైపు.. ఈ రెండు టీమ్ ల మధ్య నేడు ఐపీఎల్ లో తొలి మ్యాచ్ జరుగబోతున్నది. ఐపీఎల్ లో తొలి డబుల్ హెడర్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగబోతున్నది. ఈ సీజన్ లో పంజాబ్ కు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరిస్తుండగా కేకేఆర్ కు నితీశ్ రాణా తాత్కాలిక సారథిగా ఉండనున్నాడు. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో నితీశ్ రాణా సారథ్యంలోని కేకేఆర్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ కు రానుంది.
శ్రేయాస్ అయ్యర్ కు గాయం కావడంతో అతడి ప్లేస్ లో కెప్టెన్సీ పదవి దక్కించుకున్న రాణా.. కేకేఆర్ ను ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్ కు ఆ జట్టులో కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు.
పంజాబ్ లోని మొహాలీ క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో హోమ్ టీమ్ పంజాబ్ కూడా బలంగా ఏమీ లేదు. శిఖర్ ధావన్, భానుక రాజపక్స తప్ప ఆ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో స్పెషలిస్టు బ్యాటర్లే లేరు. గత వేలంలో రూ. 18.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్న సామ్ కరన్ ఆల్ రౌండర్ గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఈ మ్యాచ్ లో లియామ్ లివింగ్ స్టోన్ అందుబాటులో లేడు. పేస్ బాధ్యతలను అర్ష్‌దీప్ సింగ్ చూడనున్నాడు. రబాడా కూడా సౌతాఫ్రికాలోనే ఉన్నాడు.
కేకేఆర్ టీమ్ కూడా అంత గొప్పగా ఏమీలేదు. గాయాలు, కీలక ఆటగాళ్లకు విరామంతో ఆ జట్టు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంది. తొలి మ్యాచ్ కు ఫెర్గూసన్ ఆడటం లేదు. షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్ కూడా లేరు. దీంతో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాతో పాటు సీనియర్ ఆల్ రౌండర్లు ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ ల పైనే కేకేఆర్ ఆశలు పెట్టుకుంది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ - కోల్కతా లు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ లు గెలవగా పంజాబ్ 10 సార్లు విజయం సాధించింది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, సికందర్, నాథన్ ఎల్లీస్, హర్ప్రీత్ బ్రర్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్
కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మనుల్లా గుర్బాజ్, మణ్‌దీప్ సింగ్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకూల్ రాయ , ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి