గుజరాత్‌పై పగ తీర్చుకున్న ముంబై.. ప్లేఆఫ్ రేసులో మరో అడుగు ముందేసిన రోహిత్ సేన

Published : May 12, 2023, 11:31 PM IST
గుజరాత్‌పై పగ తీర్చుకున్న ముంబై.. ప్లేఆఫ్ రేసులో మరో అడుగు ముందేసిన రోహిత్ సేన

సారాంశం

IPL 2023, MI vs GT: ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేత  ముంబై ఇండియన్స్ తమ ఛాంపియన్ ఆట  ఎలా ఉంటుందో గుజరాత్ కు రుచి చూపించింది. హార్ధిక్ సేనపై ప్రతీకార విజయంతో పాటు ప్లేఆఫ్స్‌లో బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. 

ఐపీఎల్-16 లో  ఆరంభంలో  వరుసగా రెండు పరాజయాలతో   సీజన్ ను  ప్రారంభించిన ముంబై ఇండియన్స్  ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు  వెళ్లడానికి  అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నది. ఈ సీజన్ ఆరంభంలో తమను ఓడించిన గుజరాత్ టైటాన్స్‌పై ప్రతీకార విజయం దక్కించుకోవడమే గాక పాయింట్ల పట్టికలో టాప్ - 4 లో ఉండేందుకు బలమైన పునాధి వేసుకుంది.  సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో  ఫస్ట్ బ్యాటింగ్ చేసి  218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబై.. తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించి  గుజరాత్‌ను 191 పరుగులకే పరిమితం చేసి తద్వారా  27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.  

గుజరాత్ టాప్ బ్యాటర్లు అంతా విఫలమైనా స్పిన్నర్ రషీద్ ఖాన్ (32 బంంతుల్లో 79 నాటౌట్, 3 ఫోర్లు, 10 సిక్సర్లు)  ఆఖర్లో ఒంటరి పోరాటం చేసి గుజరాత్ ను గెలిపించినంత పని చేశాడు. 103 కే 8 వికెట్లు కోల్పోయిన  గుజారత్.. 191-8  చేసిందంటే  దానికి రషీద్ మెరుపులే కారణం. ఇక ఈ విజయంతో  ముంబై   ప్లేఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది.  పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 

ముంబై సూపర్ బౌలింగ్.. 

మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో  గుజరాత్ కు  ఇన్నింగ్స్ ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఫామ్ లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు వృద్ధిమాన్   సాహా (2), శుభ్‌మన్ గిల్ (6) లతో పాటు   కెప్టెన్ హార్ధిక్ పాండ్యా  (4) వెంటవెంటనే నిష్క్రమించారు. సాహా,  గిల్ వికెట్లను ఆకాశ్ మధ్వాల్ తీయగా  హార్ధిక్ ను బెహ్రన్‌డార్ఫ్ ఔట్ చేశాడు.   14 బంతులాడి  6 ఫోర్లతో ఊపు మీద కనిపించిన  విజయ్ శంకర్ ను పియుష్ చావ్లా బౌల్డ్ చేశాడు.  అబినవ్ మనోహర్  (2)  ను కుమార్ కార్తీకేయ  బౌల్డ్ చేశాడు.  

ఆదుకున్న మిల్లర్.. 

భారీ లక్ష్య ఛేదనలో  55 కే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్ ను డేవిడ్ మిల్లర్  ఆదుకున్నాడు.  మిల్లర్..   26 బంతుల్లోనే  4 బౌండరీలు,   2 భారీ సిక్సర్లతో    41 పరుగులు చేశాడు.   రాహుల్ తెవాటియాతో కలిసి  ఆరో వికెట్ కు  45 పరుగులు జోడించిన మిల్లర్.. గెలిపించకున్నా చివరి దాకా ఉంటే  గుజరాత్  ఓటమి అంతరాన్ని అయినా తగ్గిస్తాడని అనుకున్నారు.  కానీ  ఆకాశ్ మధ్వాల్   ముంబైకి మరోసారి సూపర్ బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన  12వ ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.  

13 బంతులు ఆడి   14 పరుగులు చేసిన తెవాటియా  కూడా  పియూష్ చావ్లా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి  కామెరూన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.   నూర్ అహ్మద్ ను కుమార్ కార్తీకేయ ఔట్ చేశాడు. 

భయపెట్టిన రషీద్.. 

ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రషీద్ ఖాన్.. చివర్లో మెరుపులు మెరిపించాడు.  కీలక  ఆటగాళ్లు అంతా పెవలియన్ కు చేరినా  మెరుపు బ్యాటింగ్ తో గుజరాత్ ఫ్యాన్స్ ను అలరించడమే గాక  ఒకదశలో ముంబై లో కూడా గుబులు రేపాడు. రషీద్ ఒంటరి పోరాటంతో గుజరాత్ కు ఓటమి అంతరాన్ని భారీగా తగ్గించాడు.  కీలక బ్యాటర్లందరినీ ముందే పెవిలియన్ కు పంపిన ముంబై  బౌలర్లు రషీద్ ను మాత్రం ఔట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు 

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో   ఐదు వికెట్ల నష్టానికి  218 పరుగులు చేసింది.   సూర్యకుమార్ యాదవ్  49 బంతుల్లో  11 ఫోర్లు,  6 సిక్సర్ల సాయంతో  103 పరుగులు చేసి  ముంబైకి భారీ స్కోరు అందించాడు. క్రీజులో కుదురుకునేదాకా కాస్త పద్ధతిగా బాదిన సూర్య  ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.  విష్ణు వినోద్ తో కలిసి ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  సూర్యకు తోడుగా ఇషాన్ కిషన్  (31), వినోద్ (30)  లు రాణించి ముంబైకి భారీ స్కోరును అందించారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే