సన్‌రైజర్స్ కొంపముంచిన పూరన్, అభిషేక్... కీలక మ్యాచ్‌లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ! అస్సాం ట్రైన్‌లో బెర్త్...

Published : May 13, 2023, 07:14 PM IST
సన్‌రైజర్స్ కొంపముంచిన పూరన్, అభిషేక్... కీలక మ్యాచ్‌లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ! అస్సాం ట్రైన్‌లో బెర్త్...

సారాంశం

ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు సమర్పించిన అభిషేక్ శర్మ... సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించిన నికోలస్ పూరన్..  బ్యాటర్లు రాణించినా, బౌలింగ్‌లో అట్టర్ ఫ్లాప్... తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రాణించినా, బౌలర్లు చేతులు ఎత్తేశారు. సీజన్‌లో లక్నోతో రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న లక్నో.. పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకొచ్చింది.

183 పరుగుల లక్ష్యఛేదనని నెమ్మదిగా ఆరంభించింది లక్నో సూపర్ జెయింట్స్. కైల్ మేయర్స్ 14 బంతులాడి 2 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 30 పరుగులే చేసింది లక్నో..

19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, మయాంక్ మర్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్టోయినిస్, మన్కడ్ కలిసి ఓవర్‌కో బౌండరీ బాదుతూ భాగస్వామ్యం నిర్మించారు. 35 బంతుల్లో ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

16వ ఓవర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఏకంగా 5 సిక్సర్లతో 30 పరుగులు రాబట్టింది. మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదిన స్టోయినిస్, మూడో బంతికి అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన డేంజరస్ మ్యాన్ స్టోయినిస్‌ని అవుట్ చేశామనే ఆనందం, సన్‌రైజర్స్‌కి ఎక్కువ సేపు నిలవలేదు..

నికోలస్ పూరన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్‌కి ముందు 30 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన పొజిషన్‌లో ఉన్న లక్నో, 24 బంతుల్లో 38 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది.

నటరాజన్ వేసిన 17వ ఓవర్‌లో 6,4 బాదిన ప్రేరక్ 14 పరుగులు రాబట్టగా, భువీ వేసిన 18వ ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన పూరన్ 10 పరుగులు రాబట్టాడు. నట్టూ వేసిన 19వ ఓవర్‌లో పూరన్ సిక్సర్ బాదడంతో లక్నో విజయానికి ఆఖరి ఓవర్‌లో 4 పరుగులే కావాల్సి వచ్చాయి. ఆఖరి ఓవర్ వేసిన ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్‌లో మొదటి బంతికి 2 పరుగులు రాగా తర్వాత బంతికి ఫోర్ ఇవ్వడంతో మ్యాచ్ ముగిసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నికోలస్ పూరన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేయగా ప్రేరక్ మన్కడ్, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల స్కోరు చేయగలిగింది.. అభిషేక్ శర్మ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి యుద్‌వీర్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

13 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన అన్‌మోల్ ప్రీత్ సింగ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన గ్లెన్ ఫిలిప్స్‌ని ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు కృనాల్ పాండ్యా...

29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ 25 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?