
ఐపీఎల్-16 లో వరుసగా ఐదు పరాజయాల పాలై తర్వాత ఆరు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించినా ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు పంజాబ్ కింగ్స్ తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ఢిల్లీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కానీ పంజాబ్ కు మాత్రం ఈ మ్యాచ్ ఓడితే కాస్తో కూస్తో ఉన్న ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటుతాయి. నేటి పోరులో తప్పక గెలవడం ధావన్ సేనకు అత్యవసరం. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ లో పడుతూ లేస్తూ వస్తున్న పంజాబ్.. 11 మ్యాచ్ లలో ఐదు మాత్రమే గెలిచి ఆరింట ఓడి ద 10 పాయింట్లతో ఉంది. నేడు ఢిల్లీతో పాటు తర్వాత జరుగబోయే రెండు మ్యాచ్ లలో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్ లో నాలుగో జట్టు కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. మూడ మ్యాచ్ లు గెలిస్తే ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆర్సీబీ, లక్నో, రాజస్తాన్ లకు పోటీని ఇవ్వగలదు. ఓడితే మాత్రం ఢిల్లీ తో పాటు అస్సాం రైలు ఎక్కాల్సిందే.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన వైఫల్యం బ్యాటింగే. రెండు మూడు మ్యాచ్ లలో మినహాయిస్తే ఢిల్లీ బ్యాటర్లు ప్రతీ మ్యాచ్ లో విఫలమయ్యారు. ఇన్నాళ్లు ఒత్తిడి కారణంగా విఫలమైన ఢిల్లీ బ్యాటర్లకు ఇప్పుడు ప్రెషర్ అవసరం లేదు. స్వేచ్ఛగా ఆడితే పంజాబ్ కు షాకివ్వడానికి ఢిల్లీకి అవకాశాలుంటాయి.
మరోవైపు పంజాబ్ బ్యాటింగ్ కూడా ఒడిదొడుకులుతోనే ఉంది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ ఫర్వాలేదనిపిస్తున్నా మిగిలినవారిలో జితేశ్ శర్మ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ ఆట ఆడుతున్నాడు.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలీ రూసో, అమన్ హకిమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, సికందర్ రజ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్