
ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్ అన్‌మోల్ ప్రీతో సింగ్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, అబ్దుల్ సమద్ అదరగొట్టడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల ఓ మాదిరి స్కోరు చేయగలిగింది..
అభిషేక్ శర్మ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన యుద్‌వీర్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న లక్నోకి అనుకూలంగా ఫలితం దక్కింది.
13 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన అన్‌మోల్ ప్రీత్ సింగ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన గ్లెన్ ఫిలిప్స్‌ని ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు కృనాల్ పాండ్యా... వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..
29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే క్లాసిన్ అవుట్ కావడానికి ముందు స్టేడియంలో కాసేపు హైడ్రామా నడిచింది. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ఇచ్చిన నిర్ణయాన్ని, లక్నో సూపర్ జెయింట్స్ ఛాలెంజ్ చేసింది. డీఆర్‌ఎస్‌లో బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్టుగా క్లియర్‌గా కనిపించినా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా ప్రకటించాడు..
ఈ నిర్ణయంపై హెన్రీచ్ క్లాసిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా కలిసి ‘కోహ్లీ... కోహ్లీ’ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. లక్నో సూపర్ జెయింట్స్ డగౌట్ వైపు ఎవరో ఏదో విసిరినట్టు కనిపించడంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.
కొన్ని నిమిషాల తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా ఈ సంఘటన తర్వాత ఏకాగ్రత కోల్పోయిన హెన్రీచ్ క్లాసిన్, హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించిన అబ్దుల్ సమద్ 25 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..