మళ్లీ వర్షం.. నత్తకు నడక నేర్పిన లక్నో బ్యాటర్లు.. మరో లో స్కోరింగ్ థ్రిల్లర్‌కు స్క్రిప్ట్ రెడీ!

Published : May 03, 2023, 05:30 PM IST
మళ్లీ వర్షం.. నత్తకు నడక నేర్పిన లక్నో బ్యాటర్లు.. మరో లో స్కోరింగ్ థ్రిల్లర్‌కు స్క్రిప్ట్ రెడీ!

సారాంశం

IPL 2023, LSG vs CSK: చెన్నైతో  మ్యాచ్ లో  లక్నో బ్యాటర్లు నత్తకు నడక నేర్పారు. నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని వంటబట్టించుకుని మరో చెత్త ప్రదర్శన చేశారు. 

లక్నో - చెన్నై మ్యాచ్‌ను వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. టాస్ ఆలస్యంగా  వేసిన ఈ మ్యాచ్ లో  మరో నాలుగు బంతుల్లో  మ్యాచ్ ముగుస్తుందనగా  వర్షం మళ్లీ మొదలైంది.  కాగా వర్షం వల్ల  మ్యాచ్ నిలిచే సమయానికి లక్నో.. 19.2 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయూష్ బదోని  (33 బంతుల్లో  59 నాటౌట్, 2 ఫోర్లు,  4 సిక్సర్లు)  ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 

కాగా ఐపీఎల్ -16  మొదలయ్యాక రెండోవారం నుంచి  హైస్కోరింగ్ గేమ్స్ కు మంచి  డిమాండ్ వచ్చింది. కానీ ఒక స్టేజ్ కు వచ్చాక అవి కూడా బోర్ కొట్టడంతో  ‘పిచ్’లు ఇప్పుడు  టర్న్ అవుతున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా  లో స్కోరింగ్ థ్రిల్లర్ లకు మంచి గిరాకీ ఏర్పడింది.  దీనికి తగ్గట్టుగానే నేడు  లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్  - చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా మరో లో స్కోరింగ్ థ్రిల్లర్ కు రంగం సిద్ధమైంది.  

చెన్నైతో  మ్యాచ్ లో  లక్నో బ్యాటర్లు నత్తకు నడక నేర్పారు. నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని వంటబట్టించుకున్నారు. మొన్నీమధ్యే  పంజాబ్ పై  257 పరుగులు చేసిన లక్నో విధ్వంసక వీరులు ఇవాళ  టెస్టు ఆడారు. బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించని పిచ్ పై కనీస పోరాటం కూడా చేయలేదు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో.. నాలుగో ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది.  17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో  14  పరుగులు చేసిన కైల్ మేయర్స్.. మోయిన్ అలీ బౌలింగ్ లో   రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

తీక్షణ వేసిన  ఆరో ఓవర్లో మనన్ వోహ్రా.. 11 బంతుల్లో  10 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   ఆ మరుసటి బంతికే కృనాల్ పాండ్యా  డకౌట్ అయ్యాడు.   రవీంద్ర జడేజా వేసిన  ఏడో ఓవర్లో  మార్కస్ స్టోయినిస్  (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   16 బంతులాడి  9 పరుగులే చేసిన కరణ్ శర్మ ను  మోయిన్ అలీ తన బౌలింగ్ లోనే క్యాచ్ అందుకుని పెవిలియన్ చేర్చాడు.

 

10 ఓవర్లలో  44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన  లక్నో.. ఇన్నింగ్స్ ఆ తర్వాత మరింత దారుణంగా సాగింది. అయూష్ బదోని,  నికోలస్ పూరన్  లు ఆరో వికెట్ కు  59 పరుగులు జోడించారు.   31 బంతుల్లో  20 పరుగులే చేసిన పూరన్..  మతీశ పతిరాన వేసిన  18వ ఓవర్లో  నాలుగో బంతికి  మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు.  ఆ ఓవర్లోనే  లక్నో స్కోరు వంద దాటింది.  చివర్లో  బదోని  చాహర్ వేసిన  19వ ఓవర్లో  4,6,6తో   లక్నో స్కోరును  120 దాటించాడు.  వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !