విడువని వాన.. తేలని ఫలితం.. లక్నో - చెన్నై మ్యాచ్ రద్దు

By Srinivas MFirst Published May 3, 2023, 7:12 PM IST
Highlights

IPL 2023, LSG vs CSK: లక్నో సూపర్ జెయింట్స్ -   చెన్నై సూపర్ కింగ్స్  మ్యాచ్ వర్షం వల్ల అర్థాంతరంగా రద్దైంది. వాన ఎంతకూ విడవకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. 

ఐపీఎల్ -16లో మొదటిసారి  ఒక జట్టు కాకుండా  ఫలితాన్ని వరుణుడు శాసించాడు. లక్నో  సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  లక్నో వేదికగా  జరగాల్సిన మ్యాచ్ అర్థంతరంగా నిలిచిపోయింది.   టాస్ కు ముందే హెచ్చరికలు పంపిన వరుణుడు.. తన మాటను బేఖాతరు చేసినందుకు ఈసారి కాస్త గట్టిగానే మందలించాడు.  లక్నో ఇన్నింగ్స్ పూర్తిగా ముగియక ముందే  వాన రాగా.. ఎంతసేపటికీ అది తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.  ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది.  

ఈ మ్యాచ్ లో టాస్ కు ముందే వర్షం అంతరాయం కలిగించింది. బుధవారం ఉదయం నుంచి ఇక్కడ  వర్షం పడుతోంది.  టాస్ కూడా అరగంట  ఆలస్యంగా పడింది.  టాస్ వేశాక  మ్యాచ్ సజావుగానే సాగింది. ఎండ కూడా బాగానే కాసింది. 

Latest Videos

లక్నో ఇన్నింగ్స్ 19.2 ఓవర్లప్పుడు మళ్లీ వరుణుడు ముంచెత్తాడు. చిన్నగా మొదలైన వాన ఎంతకూ తగ్గలేదు.  కొద్దిసేపటి తర్వాత అంపైర్లు  పిచ్ ను చూసిపోవడానికని  కాస్త తెరిపినిచ్చాడు.  దీంతో  లక్నో  ఇన్నింగ్స్ ను ఎండ్ కార్డ్ వేసేసి  సీఎస్కే ఓవర్లను కుదించైనా ఆడించేందుకు అంపైర్లు యత్నించారు. ఆ పనుల్లో నిమగ్నమై ఉండగానే  ‘మీరు మళ్లీ  ప్రయత్నాలు చేస్తున్నారా..?’ అని  ఆగ్రహంతో ఈసారి  మళ్లీ ఆ ఆలోచనే రాకుండా స్టేడియాన్ని ముంచెత్తాడు. దీంతో చేసేదేమీ లేక  అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.  

 

Rain Won. CSK 1. LSG 1. 🦁💛 pic.twitter.com/G6hNGDppYu

— Chennai Super Kings (@ChennaiIPL)

ఐపీఎల్ లో ఇది రెండోసారి.. 

వర్షం వల్ల ఒక మ్యాచ్ అర్థాంతరంగా రద్దు కావడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి.   2011 లో   ఢిల్లీ వేదికగా ఢిల్లీ  డేర్ డెవిల్స్ - పూణే వారియర్స్ మధ్య  మ్యాచ్ తర్వాత  వర్షం కారణంగా  ఒక మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.  

లక్నో ఇన్నింగ్స్.. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో.. నాలుగో ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది.  17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో  14  పరుగులు చేసిన కైల్ మేయర్స్.. మోయిన్ అలీ బౌలింగ్ లో   రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు. తీక్షణ వేసిన  ఆరో ఓవర్లో మనన్ వోహ్రా.. 11 బంతుల్లో  10 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   ఆ మరుసటి బంతికే కృనాల్ పాండ్యా  డకౌట్ అయ్యాడు.   రవీంద్ర జడేజా వేసిన  ఏడో ఓవర్లో  మార్కస్ స్టోయినిస్  (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   16 బంతులాడి  9 పరుగులే చేసిన కరణ్ శర్మ ను  మోయిన్ అలీ తన బౌలింగ్ లోనే క్యాచ్ అందుకుని పెవిలియన్ చేర్చాడు.

10 ఓవర్లలో  44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన  లక్నో.. ఇన్నింగ్స్ ఆ తర్వాత మరింత దారుణంగా సాగింది. అయూష్ బదోని,  నికోలస్ పూరన్  లు ఆరో వికెట్ కు  59 పరుగులు జోడించారు.   31 బంతుల్లో  20 పరుగులే చేసిన పూరన్..  మతీశ పతిరాన వేసిన  18వ ఓవర్లో  నాలుగో బంతికి  మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు.  ఆ ఓవర్లోనే  లక్నో స్కోరు వంద దాటింది.  చివర్లో  బదోని  చాహర్ వేసిన  19వ ఓవర్లో  4,6,6తో   లక్నో స్కోరును  120 దాటించాడు.  వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అయూష్ బదోని  (33 బంతుల్లో  59 నాటౌట్, 2 ఫోర్లు,  4 సిక్సర్లు)  ఒక్కడే రాణించాడు. 

click me!