
ప్లేఆఫ్స్ రేసులో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ మరోసారి విఫలమైనా నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ఎదుట మోస్తారు లక్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆది నుంచే లక్నో బ్యాటర్లను నిలువరించిన కేకేఆర్ బౌలర్లు.. ఆ జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఇక ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసులో లక్నోకు తిప్పలు తప్పవు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు హర్షిత్ రాణా మూడో ఓవర్లోనే షాకిచ్చాడు. రాణా వేసిన మూడో ఓవర్ మూడో బాల్‌కు లక్నో ఓపెనర్ కరణ్ శర్మ (3) శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
కరణ్ నిష్క్రమించినా క్వింటన్ డికాక్ (27 బంతుల్లో 28, 2 సిక్సర్లు), ప్రేరక్ మన్కడ్ (20 బంతుల్లో 26, 5 ఫోర్లు) లక్నో స్కోరుబోర్డును నడిపించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 41 పరుగులు జోడించారు. కానీ రెండు ఓవర్ల వ్యవధిలో లక్నోకు భారీ షాకులు తాకాయి.
వైభవ్ అరోరా వేసిన ఏడో ఓవర్ లో ప్రేరక్ మన్కడ్.. హర్షిత్ రాణాకు క్యాచ్ ఇవ్వగా ఇదే ఓవర్లో ఆఖరి బంతికి మార్కస్ స్టోయినిస్ డకౌట్ అయ్యాడు. సునీల్ నరైన్ వేసిన పదో ఓవర్లో నాలుగో బంతికి కృనాల్ పాండ్యా (9) భారీ షాట్ ఆడబోయి రింకూ సింగ్ చేతికి చిక్కాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు క్వింటన్ డికాక్ ఇచ్చిన క్యాచ్ ను రసెల్ అందుకోవడంతో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది.
73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లక్నోను నికోలస్ పూరన్, అయుష్ బదోని (21 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్) లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఎప్పటిలాగే పూరన్ ధాటిగా ఆడాడు. డికాక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో వచ్చిన పూరన్.. తాను ఎదుర్కున్న మొదటి మూడు బంతులకే 4, 4, 6 బాదాడు. సుయాశ్ శర్మ వేసిన 15వ ఓవర్లో కూడా 6, 4 కొట్టాడు. నరైన్ వేసిన 18వ ఓవర్లో బదోని.. శార్దూల్ కు క్యాచ్ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ బాల్ భారీ సిక్సర్ బాదిన పూరన్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇదే ఓవర్లో మూడో బాల్ కు వెంకటేశ్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో రవి బిష్ణోయ్ (2) కూడా ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో రసెల్ 13 పరుగులివ్వడంతో లక్నో స్కోరు 170 మార్క్ దాటింది.