క్వాలిఫైయర్‌కి చెన్నై సూపర్ కింగ్స్! డేవిడ్ వార్నర్ పోరాడినా, మరో ఓటమితో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్...

By Chinthakindhi RamuFirst Published May 20, 2023, 7:18 PM IST
Highlights

IPL 2023: 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమైపోయింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 77 పరుగుల భారీ తేడాతో ఓడించిన సీఎస్‌కే, సీజన్‌లో 8వ విజయాన్ని అందుకుంది.. ఐపీఎల్ చరిత్రలో 12వ సారి ప్లేఆఫ్స్ ఆడనుంది ధోనీ టీమ్. 

పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న సీఎస్‌కే 17 పాయింట్లతో  గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమే. సీఎస్‌కే క్వాలిఫైయర్ ఆడకుండా ఆపాలంటే లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్‌పై 100+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది..

Latest Videos

224 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు అనిపించలేదు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పృథ్వీ షా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

6 బంతుల్లో 3 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్‌ని అవుట్ చేసిన దీపక్ చాహార్, ఆ తర్వాతి బంతికి రిలే రసోని గోల్డెన్ డకౌట్ చేశాడు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢీసీ...

15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన యష్ ధుల్, డేవిడ్ వార్నర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..

ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 108 పరుగులు కావాల్సి వచ్చాయి. దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 3 ఫోర్లు రావడంతో 15 పరుగులు వచ్చాయి. 

పథిరాణా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొదటి బంతికే ఆమన్ హాకీం ఖాన్ అవుట్ అయ్యాడు. ఆమన్ హాకీం 7 పరుగులు చేసి అవుట్ కాగా 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన డేవిడ్ వార్నర్, పథిరాణా బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది. 

లలిత్ యాదవ్ 6, కుల్దీప్ యాదవ్ పరుగులేమీ చేయకుండా మహీశ్ తీక్షణ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి చేతన్ సకారియా డకౌట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. డీఆర్‌ఎస్‌లో నాటౌట్‌గా తేలినా ఆ బంతికి పరుగులేమీ రాకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 146 పరుగులకి తెరపడింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది... అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ...

ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ఫీల్డింగ్ కారణంగా రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్, 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి... చేతన్ సకారియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

తొలి వికెట్‌కి 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, డి వాన్ కాన్వే, ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు.  

శివమ్ దూబే 9 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి డివాన్ కాన్వే కూడా పెవిలియన్ చేరాడు..

52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో ఆమన్ హకీం ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 7 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా ధోనీ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

click me!