బోణీ కొట్టేందుకు బాటలు పర్చుకున్న ఢిల్లీ.. క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి కేకేఆర్ పరేషాన్..

Published : Apr 20, 2023, 10:29 PM IST
బోణీ కొట్టేందుకు బాటలు పర్చుకున్న ఢిల్లీ.. క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి కేకేఆర్ పరేషాన్..

సారాంశం

IPL 2023, DC vs KKR: ఐపీఎల్ -16లో బోణీ కొట్టేందుకు  ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి అవకాశం లభించింది.  వర్షం వల్ల ఆలస్యమైన  మ్యాచ్ లో  కేకేఆర్ బ్యాటర్లు  క్యాపిటల్స్ బౌలర్లను ఆడటానికి వణికిపోయారు. 

ఐపీఎల్ -16లో  వరుసగా ఐదు ఓటముల తర్వాత  బోణీ కొట్టేందుకు  ఢిల్లీ క్యాపిటల్స్ కు చక్కటి అవకాశం చిక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో   వార్నర్ సేన బౌలింగ్ ధాటికి కేకేఆర్ వణికిపోయింది. ఢిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో   కేకేఆర్.. నిర్ణీత  20 ఓవర్లలో  127 పరుగులకే ఆలౌట్ అయింది.  ఆ జట్టులో  ఓపెనర్ జేసన్ రాయ్ (39 బంతుల్లో 43, 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. చివర్లో ఆండ్రూ రసెల్  (38 నాటౌట్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి కేకేఆర్ కు పోరాడే స్కోరును అందించాడు. మరి  వాన తర్వాత బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై  ఢిల్లీ బ్యాటర్లు ఏం చేస్తారో..?

వర్షం వల్ల  గంటన్నర ఆలస్యంగా ఆరంభమైన  మ్యాచ్ లో టాస్ గెలిచి   ఫీల్డింగ్ ఎంచుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్  కెప్టెన్  డేవిడ్ వార్నర్ నిర్ణయం   సరైందేనని  ఆ జట్టు బౌలర్లు నిరూపించారు.   ఈ మ్యాచ్ లో కొత్త ఓపెనింగ్ జోడీతో  వచ్చిన కేకేఆర్ కు కష్టాలు తప్పలేదు.   ఓపెనర్ లిటన్ దాస్ (4)  ను ముఖేశ్ కుమార్  రెండో ఓవర్లోనే ఔట్ చేశాడు. 

వికెట్ల టపటప.. 

లిటన్ దాస్  నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన  వెంకటేశ్ అయ్యర్  పై కేకేఆర్ మరోసారి ఆశలు పెట్టుకుంది.  ముంబై ఇండియన్స్ తో గత మ్యాచ్ లో  సెంచరీ  చేసిన  అయ్యర్..   ఢిల్లీతో మ్యాచ్ లో మాత్రం  రెండు బంతులు ఆడి  డకౌట్ అయ్యాడు.  ఢిల్లీకే చెందిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా  కూడా నాలుగు పరుగులే చేసి ఇషాంత్ బౌలింగ్ లో  పెవిలియన్ కు చేరాడు. 

మన్‌దీప్ సింగ్   (12)  ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సీజన్ లో మెరుపులు మెరిపిస్తున్న  రింకూ సింగ్   కూడా  8 బంతుల్లో  ఆరు పరుగులే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ చేతికి చిక్కాడు.   సునీల్ నరైన్  (4) ను  ఇషాంత్ శర్మ  ఔట్ చేశాడు.     ఓపెనర్ గా వచ్చి   14వ ఓవర్ దాకా ఉండి  43 పరుగులు చేసిన  జేసన్  రాయ్‌ను  కుల్దీప్ యాదవ్   15వ ఓవర్లో  నాలుగో బంతికి ఔట్ చేశాడు.   ఆ మరుసటి బంతికే అనుకుల్ రాయ్   కూడా  డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ కోసం ట్రై చేసిన కుల్దీప్  యత్నాలపై ఉమేశ్ యాదవ్  నీళ్లు చల్లాడు. కానీ 5 బంతుల్లో 3 పరుగులు చేసిన ఉమేశ్ ను   నోర్జే తన  బౌలింగ్ లోనే తానే క్యాచ్ పట్టి  పెవిలియన్ చేర్చాడు.  కానీ ఆఖర్లో  ఆండ్రూ రసెల్ కేకేఆర్ స్కోరు వంద పరుగులు దాటించడమే గాక    ఆఖరి ఓవర్లో    మూడు భారీ సిక్సర్లు బాది కేకేఆర్  కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 

కేకేఆర్ బ్యాటర్లలో   జేసన్ రాయ్, ఆండ్రూ రసెల్, మన్‌దీప్ సింగ్ మినహా మిగిలినవారంతా  సింగిల్ డిజిట్ కు ఔటైనవారే.  ఢిల్లీ బౌలర్లలో   ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశాడు.   అతడు నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులే ఇవ్వడం గమనార్హం.   నోర్జే తో పాటు అక్షర్, కుల్దీప్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే