
మరో పది రోజుల్లో ఐపీఎల్ -15 వ సీజన్ ప్రారంభం కానున్నది. కొవిడ్-19 దృష్ట్యా ఈ సీజన్ కూడా బయో బబుల్ లోనే జరుగుతుంది. అయితే గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి లీగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పటిష్ట చర్యలను చేపట్టింది. బుడగ (బయో బబుల్) ఉల్లంఘులకు భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. బబుల్ నిబంధనలను పాటించని వారికి జరిమానాలు, మ్యాచులలో నిషేధాలు, కుటుంబాలకు క్వారంటైన్ వంటి కఠిన నిబంధనలను జారీ చేయనుంది. ఈ మేరకు ఆయా ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ లో వచ్చిన కథనాల మేరకు.. ఎవరైనా ఆటగాడు లేదా ఫ్రాంచైజీ ప్రతినిధి ఎవరైనా బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఇక రెండో ఉల్లంఘనకు ఒక మ్యాచ్ నిషేధం.. మూడోసారి తప్పు చేస్తే వాళ్లు పూర్తిగా బయో బబుల్ నుంచే తొలగించబడతారు. అయితే వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించరు.
ఫ్రాంచైజీలకూ..
ఇది ఆటగాడి వరకేనండోయ్.. ఫ్రాంచైజీకి వేరే లెవల్ శిక్షలున్నాయి. ఆటగాడు లేదా అధికారి తొలి సారి బబుల్ నిబంధనలన ఉల్లంఘిస్తే ఫ్రాంచైజీ రూ. 1 కోటి రూపాయల జరిమానా చెల్లించాలి. రెండో సారికి ఒక పాయింట్ కోత.. మూడో సారికైతే రెండు పాయింట్లు కట్..
కుటుంబాలకూ పలు నిబంధనలు..
బబుల్ నిబంధనలను ఆటగాళ్ల, ప్రతినిధుల కుటుంబాలు ఉల్లంఘిస్తే.. సదరు ఉల్లంఘులకు మొదటి తప్పుకైతే ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజులు క్వారంటైన్ లో గడపాల్సిందే. క్వారంటైన్ లో ఉండగా ఏ ఆటగాడికి కూడా మ్యాచ్ ఫీజ్ చెల్లించబడదు. రెండో సారి తప్పునకు.. కుటుంబ సభ్యుడి (నిబంధనలు ఉల్లంఘించినవారు) ని బబుల్ నుంచి తొలగిస్తారు.
దీంతో పాటు కొవిడ్ టెస్టుకు నిరాకరించే ఆటగాళ్లు/ప్రతినిధులపై కూడా బీసీసీఐ కొరడా ఝుళిపించనుంది. కరోనా టెస్టును నిరాకరించే సభ్యులకు తొలిసారి హెచ్చరించి వదిలేస్తారు. రెండోసారి రూ. 75వేల జరిమానాతో పాటు స్టేడియంలో అనుమతి నిరాకరణ.
గతేడాది ఐపీఎల్ తొలి సీజన్ లో పలు ఉల్లంఘనలతో సీజన్ మొత్తం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.