IPL 2022: పాండ్యా హాఫ్ సెంచరీ.. రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. బెంగళూరు ముందు ఊరించే టార్గెట్

By Srinivas MFirst Published May 19, 2022, 9:28 PM IST
Highlights

IPL 2022 RCB vs GT:  తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి  గుజరాత్ టైటాన్స్ ను నిలువరించారు. ఇక ఇప్పుడు బ్యాటర్ల వంతు.  

ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు  రాణించారు. కట్టుదిట్టంగా బంతులేసి గుజారత్ టైటాన్స్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇరగదీస్తారనుకున్న గుజరాత్ బ్యాటర్లలో హార్ధిక్ పాండ్యా, సాహా తప్ప మిగలినవాళ్లు పెద్దగా రాణించలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్.. 5 వికెట్లు కోల్పోయి 168  పరుగులు  చేసింది. మరి బౌలింగ్ కు అనుకూలిస్తున్న  పిచ్ పై   గుజరాత్ బౌలర్లను తట్టుకుని ఆర్సీబీ బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.  

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్ టైటాన్స్ కు ఆరంభమేమీ అదిరిపోలేదు. ఆ జట్టు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (22 బంతుల్లో 31.. 4 ఫోర్లు, 1 సిక్స్)   ఎప్పటిలాగే దూకుడుగా ఆడినా..  శుభమన్ గిల్ (1) మాత్రం నిరాశపరిచాడు. 4 బంతులాడిన అతడు.. హెజిల్వుడ్ బౌలింగ్ లో మ్యాక్స్వెల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో  నిష్క్రమించాడు. 

సిద్ధార్థ్ కౌల్ వేసిన తొలి ఓవర్లోనే 2 ఫోర్లు, సిక్సర్ తో 14 పరుగులు రాబట్టిన సాహా.. తర్వాత నెమ్మదించాడు. గిల్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన  మాథ్యూ వేడ్ (16.. 2 ఫోర్లు, సిక్స్) టచ్ లోనే కనిపించినా  మ్యాక్స్వెల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు. అయితే ఈ ఔట్ పై అతడు తీవ్ర నిరాశగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్ కంటే ముందు  బ్యాట్ ను ముద్దాడుతూ వెళ్లినట్టు టీవీ రిప్లేలో కూడా కనిపించినా  అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. ఐదు ఓవర్లలో గుజరాత్ 2 వికెట్లు కోల్పోయింది. 

ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది.  ఇదే క్రమంలో జోరుమీదున్న సాహాను డుప్లెసిస్  అద్భుత త్రోతో రనౌట్ చేశాడు. సాహా స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 34.. 3 సిక్సర్లు ) తో  కలిసి హార్ధిక్ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  నెమ్మదిగా ఆడాడు.  అడపాదడపా బంతి బౌండరీ దాటినా ఆర్సీబీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరడంతో గుజరాత్ కు  పరుగుల రాక కష్టమైంది. 13 ఓవర్లకు  గుజరాత్ స్కోరు 3 వికెట్లకు 91 పరుగులే.. 

అయితే 14వ ఓవర్లో మిల్లర్ గేర్ మార్చాడు. మ్యాక్స్వెల్ వేసిన 14వ ఓవర్లో ఆఖరి రెండు బంతులను అతడు స్టాండ్స్ లోకి పంపాడు. తర్వాత షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లోనూ  సిక్సర్ బాదాడు. అయితే 17వ ఓవర్ వేసిన  హసరంగ..  మిల్లర్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో హెజిల్వుడ్.. తెవాటియా (2) కూడ పెవిలియన్ కు పంపాడు. కానీ 19వ ఓవర్లో రషీద్ ఖాన్ (6 బంతులలో 19 నాటౌట్.. 1 ఫోర్, 2 సిక్సర్లు).. ఫోర్, సిక్సర్ తో  గుజరాత్ స్కోరు ను 150 దాటించాడు. 

 

Time to defend.. Let's go Titans 💪 | | pic.twitter.com/siWeWxHk4S

— Gujarat Titans (@gujarat_titans)
click me!