
కొత్త జట్టు.. కొత్త కెప్టెన్.. కొత్త సవాళ్లు.. ఐపీఎల్ లో కొత్తగా అడుగిడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నది. సుమారు రూ. 5 వేల కోట్లకు పైగా బిడ్ వేసి అహ్మదాబాద్ ప్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ యాజమాన్యం.. జట్టు పేరును గుజరాత్ టైటాన్స్ గా నామకరణం చేసి రాష్ట్ర అభిమానుల ఆధరణను పొందుతున్నది. ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆ జట్టు అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఇకనుంచి ఐపీఎల్ కామెంట్రీ వారి సొంతభాష (గుజరాతీ) లో కూడా చూడొచ్చు. ఈ మేరకు బీసీసీఐ అధికార ప్రసారదారు డిస్నీ స్టార్ ఈ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు కూడా గుజరాత్ వాసులే.. వీరి మాతృభాష గుజరాతీనే కావడం గమనార్హం.
మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఐపీఎల్ ను ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు స్థానిక భాషల్లో కూడా ప్రసారం చేస్తుంది డిస్నీ స్టార్ నెట్వర్క్. ఇప్పటికే స్టార్.. తెలుగు, తమిళం, కన్నడలలో కూడా ఐపీఎల్ కామెంట్రీని అందిస్తున్నది. ఇప్పుడు ఐపీఎల్ ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు, మరికొన్ని స్థానిక భాషల్లోకి వెళ్లేందుకు డిస్నీ స్టార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
2022 సీజన్ నుంచి గుజరాతీలో కూడా ఐపీఎల్ ప్రసారాలను చూడొచ్చు. ఆ రాష్ట్ర ప్రజలు.. వారి సొంత జట్టు గుజరాత్ టైటాన్స్ పాల్గొనే మ్యాచులతో పాటు ఇతర జట్ల మ్యాచులకు సంబంధించిన కామెంట్రీని కూడా గుజరాతీలో వినొచ్చని డిస్నీ స్టార్ హెడ్ (స్పోర్ట్స్) సంజోగ్ గుప్తా వెల్లడించారు. ఈ మేరకు గుజరాతీలో చెప్పే కామెంట్రీకి కామెంటేటర్ లను కూడా ఎంపిక చేశారు. అయితే ఇది హాట్ స్టార్ లో మాత్రమేనని వార్తలు వస్తున్నాయి. టీవీలలో కూడా వస్తుందా..? లేదా..? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగియాలతో పాటు మరో వికెట్ కీపర్ ప్రస్తుత సెలెక్టర్లకు చైర్మెన్ గా వ్యవహరిస్తున్న కిరణ్ మోరే కూడా గుజరాతీ కామెంట్రీ అందించనున్నారు. వీరితో పాటు పలువురు రేడియో జాకీలు కూడా వీరితో జతకలవనున్నారు.
బెంగాళీ, మళయాళం, మరాఠీలో కూడా..
గుజరాతీ తో పాటు బెంగాళీ (పశ్చిమ బెంగాల్), మళయాళం (కేరళ), మరాఠీ (మహారాష్ట్ర) భాషలలో కూడా ఈసారి ఐపీఎల్ కామెంట్రీ అందివ్వనున్నట్టు స్టార్ తెలిపింది. అయితే శనివారం, ఆదివారం జరిగే మ్యాచులకు మాత్రమే బెంగాళీ, మళయాలంలో కామెంట్రీ చెప్పనున్నారు. మిగతా రోజుల్లో మాత్రం ఆ భాషల్లో కామెంట్రీ ఉండదు. ఇక గుజరాతీతో పాటు మరాఠీలో కూడా సీజన్ అంతా ఐపీఎల్ ప్రసారాలుంటాయని సంజోగ్ గుప్తా తెలిపారు. ఐపీఎల్ మొత్తం ముంబై, పూణెలలో జరుగుతుండటం.. మరాఠా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు గాను స్టార్ ఈ భారీ ప్లాన్ వేసింది.
రెండు నెలల పాటు సాగే ఈ మెగా సీజన్ ఈనెల 26న చెన్నై సూపర్ కింగ్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచుతో తెరలేవనుంది. పది టీములు పాల్గొనే ఈ సీజన్ లో 70 మ్యాచులుంటాయి.