
తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ముంబై ఇండియన్స్ తరఫునే ఆడిన శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ ఇటీవలే.. తన సొంతజట్టును కాదని రాజస్థాన్ రాయల్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. అయితే మలింగ నిర్ణయంపై ముంబై ఇండియన్స్ జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని.. ఇన్నాళ్లు అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని మలింగ వమ్ము చేశాడని జట్టు యాజమాన్యం వాపోయినట్టు వార్తలు వచ్చాయి. విశ్రాంతి కోరుకున్న మలింగ.. ఉన్నట్టుండి రాజస్థాన్ రాయల్స్ కు బౌలింగ్ కోచ్ గా ఎంపికవడంపై ముంబై జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్ధనె అభిప్రాయమేమిటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర.
రాజస్థాన్ రాయల్స్ జట్టు విడుదల చేసిన ఓ వీడియోలో సంగక్కర మాట్లాడుతూ... మలింగ తీసుకున్న నిర్ణయంతో మహేళ సంతోషం వ్యక్తం చేశాడని సంగక్కర అన్నాడు. ముంబై జట్టు అతడిమీద ఆసక్తితో ఉన్నా వాళ్లకు ఆ స్పేస్ లేదని తెలిపాడు.
సంగక్కర మాట్లాడుతూ... ‘మలింగకు అవకాశం రావడం మహేళకు కూడా సంతోషాన్నిచ్చింది. అతడు (మలింగ) ఎక్కువకాలం ముంబైతో ఆడటం వల్ల అతడు తిరిగి అదే జట్టుకు బౌలింగ్ కోచ్ గా వస్తాడని అందరూ భావించడంలో తప్పులేదు. కానీ వాళ్లకు కోచింగ్ సిబ్బంది సరిపడినంతగా ఉన్నారు. హెడ్ కోచ్ గా జయవర్ధనె ఉండగా.. బౌలింగ్ కోచ్ లుగా షేన్ బాండ్ (న్యూజిలాండ్) జహీర్ ఖాన్ ఉన్నారు. మలింగ మాతో చేరడం మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది..’ అని చెప్పుకొచ్చాడు.
తన ఐపీఎల్ కెరీర్ అంతా ముంబై ఇండియన్స్ తోనే గడిపాడు మలింగ.. ఐపీఎల్ లో అతడు 2009 లో ఎంట్రీ ఇచ్చాడు. 2009 నుంచి 2019 సీజన్ దాకా అతడు ముంబైతోనే కలిసి నడిచాడు. ముంబై తరఫున 122 మ్యాచులాడిన మలింగ.. ఏకంగా 170 వికెట్లు పడగొట్టాడు. అయితే గత వారం అతడు రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడుతూ.. 12 ఏండ్లలో రూ. 48.22 కోట్లు సంపాదించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మలింగ రాజస్థాన్ తో చేరడానికి కీలక కారణాలు :
- సంగక్కరతో కలిసి మలింగకు 15 ఏండ్ల అనుబంధం ఉంది.
- సంగక్కర లంకకు సారథిగా వ్యవహరించిన సమయంలో మలింగ లంకకు కీలక బౌలర్ గా ఎదిగాడు.
- తనను తాను బౌలర్ గానే కాకుండా కోచ్ గా కూడా నిరూపించుకోవడానికి మలింగకు ఇదో సువర్ణావకాశం. అయితే ముంబైలో ఇప్పటికే షేన్ బాండ్, జహీర్ ఖాన్ లు ఉండటంతో అతడికి ఆ అవకాశం దక్కలేదు.