తుపాకీ నీడన భయపడుతూ క్రికెట్ ఆడలేం... పాకిస్తాన్‌ పర్యటన రద్దు చేసుకున్న న్యూజిలాండ్...

By Chinthakindhi RamuFirst Published Sep 17, 2021, 3:06 PM IST
Highlights

ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన న్యూజిలాండ్... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు అర్ధాంతరంగా పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన కివీస్...

ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ జట్టు, నేటి నుంచి వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే మొదటి వన్డే ఆరంభానికి ముందు అర్ధాంతరంగా పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్. దీనికి పాకిస్తాన్‌లోని భద్రతా ఏర్పాట్లపై న్యూజిలాండ్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేయడమే కారణంగా తెలుస్తోంది...

మొదటి వన్డే ఆరంభానికి ముందు న్యూజిలాండ్ జట్టులో మూడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్టు, దీంతో ఇరు జట్ల ప్లేయర్లు హోటల్ గదులకే పరిమితమైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో స్ట్రేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతించడం లేదు.

చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది న్యూజిలాండ్. ఈ టూర్‌లో మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది న్యూజిలాండ్. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లూ, టీ20 వరల్డ్‌కప్ కోసం యూఏఈ రావాల్సి ఉంది.

అయితే పాక్‌లోని పరిస్థితులపై న్యూజిలాండ్ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయకపోవడం, అక్కడ కివీస్ ప్లేయర్లకు ప్రమాదం ఉండవచ్చనే బెదిరింపులతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు న్యూజిలాండ్ క్రికెట్ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఈ సిరీస్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్..

ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని, సెక్యూరిటీ కారణాలతో పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించడంపై పాక్ ఇంకా స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు.

click me!