చెన్నై వర్సెస్ హైదరాబాద్: నేటి మ్యాచులో ఇరుజట్ల కీలక వ్యూహాలు ఇవే...

By team teluguFirst Published Oct 13, 2020, 1:31 PM IST
Highlights

ఏడు మ్యాచుల్లో హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించగా, సూపర్‌కింగ్స్‌ కేవలం రెండు విజయాలతోనే సరిపెట్టుకుంది.  లీగ్ దశ ద్వితీయార్థం మ్యాచుల్లో అడుగుపెడుతున్న హైదరాబాద్‌, చెన్నైలకు ఇక చావోరేవో!

ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణించే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ది తొలి స్థానమైతే..2016 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో స్థానానికి చేరుకుంది.  కోర్‌ జట్టుపై అపార నమ్మకం ఉంచే ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఎన్నడూ నిరాశపరచలేదు. 

కానీ బయో బబుల్‌ ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి. ఐపీఎల్‌ 2020లో సగం మ్యాచులు ఆడేసిన హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌లు గెలుపు గీతకు దూరంగా ఉంటున్నాయి. 

ఏడు మ్యాచుల్లో హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించగా, సూపర్‌కింగ్స్‌ కేవలం రెండు విజయాలతోనే సరిపెట్టుకుంది.  లీగ్ దశ ద్వితీయార్థం మ్యాచుల్లో అడుగుపెడుతున్న హైదరాబాద్‌, చెన్నైలకు ఇక చావోరేవో!

ఏడు మ్యాచుల్లో కనీసం 5-6 మ్యాచులు నెగ్గితేనే ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడతాయి. లేదంటే చెన్నైసూపర్‌కింగ్స్‌ తొలిసారి లీగ్‌ దశ నుంచే నిష్కమించే ప్రమాదం కనిపిస్తోంది.

వ్యూహంలో ఇవి కీలకం:

1. ఈ సీజన్‌లో హైదరాబాద్‌, చెన్నై తలపడటం ఇది రెండోసారి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 164 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఛేదనలో చెన్నై ఐదు వికెట్లు కోల్పోయినా.. గెలుపు గీతకు ఏడు పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఓ సీజన్‌లో చెన్నైపై హైదరాబాద్‌ రెండు మ్యాచులు నెగ్గలేదు.

2. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఓపెనర్లు ఎప్పుడూ సరైన లక్ష్యాన్ని నిర్దేశించలేదు. మిడిల్‌ ఓవర్లలో ఆ జట్టు రన్‌రేటు 6.90-7.13గా ఉంది. చెన్నై ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ తొలి పది బంతుల్లో 227 స్ట్రయిక్ రేటును కలిగి ఉన్నాడు.  బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కరన్‌ను ముందుకు పంపితే.. ఆఖరు ఐదు ఓవర్లలో ధోని, జడేజాలపై ఒత్తిడి తగ్గనుంది.

3. 2018 నుంచి హైదరాబాద్‌పై షేన్‌ వాట్సన్‌ అత్యధిక పరుగులు సాధించాడు. 2018 ఫైనల్లో సెంచరీ సహా ఆ జట్టుపై 156 స్ట్రయిక్‌రేటుతో 311 పరుగులు చేశాడు. హైదరాబాద్‌ ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌పై వాట్సన్‌కు తిరుగులేని రికార్డుంది. రషీద్‌ ఖాన్‌కు వాట్సన్‌ ఇప్పటివరకూ ఒక్క వికెట్‌ కోల్పోలేదు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్‌: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, జగదీశన్‌, ఎం.ఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌, డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌.   

click me!