
సెంచూరియన్ టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే వరుస వికెట్లు కోల్పోయి 327 పరుగులకి ఆలౌట్ అయ్యింది భారత జట్టు. ఓవర్‌నైట్ స్కోరు 272/3 వద్ద బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 30 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి 308/9 స్కోరుకి చేరుకుంది. ఆఖరి వికెట్‌కి జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కలిసి పరుగులు జోడించడంతో 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా.
మూడో రోజు నాలుగో ఓవర్‌లోనే భారత జట్టుకి తొలి షాక్ తగిలింది. 260 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 123 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రబాడా బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
ఓవర్ నైట్ స్కోరుకి కేవలం ఒక్క పరుగు మాత్రమే జత చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ (153 పరుగులు) తర్వాత సెంచూరియన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్.
ఆ తర్వాత రెండు ఓవర్లకే అజింకా రహానే వికెట్ తీశాడు లుంగి ఎంగిడి. 102 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసిన అజింకా రహానే, 2 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గత పర్యటనలో సౌతాఫ్రికాలో ఆడిన చివరి ఇన్నింగ్స్‌లోనూ సరిగా 48 పరుగులే చేశాడు రహానే..
అజింకా రహానే అవుటైన తర్వాత ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్, 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి కేశవ్ మహరాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... శార్దూల్ ఠాకూర్ కూడా 4 పరుగులకే అవుట్ కావడంతో 304 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా.
ఆ తర్వాత మహ్మద్ షమీ 9 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అవుట్ కాగా... జస్ప్రిత్ బుమ్రా 14, మహ్మద్ సిరాజ్ 4 పరుగులు చేశారు. 9 వికెట్లు పడిన తర్వాత వికెట్లు తీసిన లుంగి ఎంగిడి, రబాడాల స్థానంలో ముల్దర్, జాన్సెన్‌లను బౌలింగ్‌కి తెచ్చాడు సఫారీ కెప్టెన్ ఎల్గర్.
దీన్ని వాడుకుంటూ బుమ్రా, సిరాజ్ ఆఖరి వికెట్‌కి 29 బంతుల్లో 19 పరుగులు జోడించారు. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో బుమ్రా రెండు ఫోర్లు బాదిన బుమ్రా, మరో షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ఇందులో ఆరు వికెట్లు లుంగి ఎంగిడి ఖాతాలోనే చేరగా, రబాడా మూడు వికెట్లు తీయడం విశేషం. అంతకుముందు సౌతాఫ్రికా టూర్‌ను భారత జట్టు మంచి పాజిటివ్ ఎనర్జీతో ఆరంభించింది. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది టీమిండియా. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయిన విషయం తెలిసిందే.
మొదటి రోజు మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ 35 పరుగులు చేసి అవుట్ కావడంతో 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
49 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఇంతకుముందు 1997లో 41 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఇంత తక్కువ పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.