వాళ్లూ కొడుతున్నారు.. భారీ లక్ష్య ఛేదనలో ధీటుగా ఆడుతున్న కివీస్.. బ్రేక్ ఇచ్చిన శార్దూల్

By Srinivas MFirst Published Jan 24, 2023, 7:43 PM IST
Highlights

INDvsNZ 3rd ODI Live: భారత్ - కివీస్ జట్ల మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా  నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  న్యూజిలాండ్ కూడా   ధాటిగానే ఆడుతున్నది.  

బౌండరీలు చిన్నగా ఉండే ఇండోర్ స్టేడియంలో  భారత బ్యాటర్ల మాదిరే  కివీస్ కూడా రెచ్చిపోతున్నది. భారత్ నిర్దేశించిన  386 పరుగుల లక్ష్య ఛేదనలో  కివీస్..   26 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.  న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే  (116 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కాడు. అతడికి నికోలస్ (42), డారిల్ మిచెల్ (24) అండగా నిలిచారు. అయితే శార్దూల్ ఠాకూర్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 26 వ ఓవర్లో మిచెల్,  కెప్టెన్ టామ్ లాథమ్ లు ఔటయ్యారు.  

కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ కు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తాకింది. హార్ధిక్ పాండ్యా వేసిన  తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ (0) డకౌట్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ఆరంభించింది.  

కానీ నాలుగో ఓవర్ నుంచి కథ మారిపోయింది.  వాషింగ్టన్ సుందర్ వేసిన  నాలుగో ఓవర్లో  కాన్వే రెండు ఫోర్లు కొట్టాడు. శార్దూల్ వేసిన  ఆరో ఓవర్లో నికోలస్.. 6, 4 బాదాడు.   బౌలర్ ఎవరైనా  సరే  కివీస్ బాదుడు మాత్రం ఆగలేదు. ఓవర్ కు ఒక  ఫోర్,  సిక్సర్ అన్న  రేంజ్ లో  ఆ జట్టు ఆట సాగింది. పది ఓవర్లకు కివీస్ స్కోరు ఒక  వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 

వాషింగ్టన్ సుందర్ వేసిన  14వ ఓవర్లో  భారీ సిక్సర్ బాదిన కాన్వే.. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేశాడు. ఈ ఇద్దరూ కలిసి  అప్పటికే వంద పరుగులు పూర్తి చేసి లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో  ఈ జంటను కుల్దీప్ యాదవ్ విడదీశాడు. అతడు వేసిన  15వ ఓవర్  ఐదో బంతికి  నికోలస్ ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు.  

నికోలస్ ఔటయ్యాక వచ్చిన  మిచెల్ తో కలిసి కాన్వే  రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన  23వ ఓవర్ మూడో బంతికి  భారీ సిక్సర్ బాదిన  కాన్వే 90లలోకి వచ్చాడు.  ఆ తర్వాత చాహల్ బౌలింగ్ లో  రెండు భారీ సిక్సర్లు బాది   71 బంతులలో  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేలలో కాన్వేకు ఇది మూడో సెంచరీ.   25 ఓవర్లకు ఆ జట్టు స్కోరు  184-2గా ఉంది. 

అయితే  26వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్.. మిచెల్  ను పెవలియన్ కు పంపాడు. ఆ ఓవర్లో తొలి బంతి..  మిచెల్ బ్యాట్ ను తాకుతూ  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. దీంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో తర్వాత బంతికి  కెప్టెన్ టామ్ లాథమ్ (0)  హార్ధిక్ పాండ్యాకు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   ప్రస్తుతం కాన్వే తో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఆడుతున్నారు.  ఈ ఇద్దరితో పాటు ప్రమాదకర బ్రాస్‌వెల్, సాంట్నర్ ల వికెట్లు  తీస్తేనే భారత్ కు ఈ మ్యాచ్ లో విజయావకాశాలు ఉంటాయి.  

click me!