ఆరంభం అదుర్స్.. మిడిలార్డర్ తుస్.. ఇండోర్‌‌లో కివీస్ ముందు భారీ స్కోరు

By Srinivas MFirst Published Jan 24, 2023, 5:10 PM IST
Highlights

INDvsNZ 3rd ODI Live: ఇండియా-న్యూజిలాండ్ మధ్య  ఇండోర్ (మధ్యప్రదేశ్) వేదికగా జరుగుతున్న  మూడో వన్డేలో  భారత ఓపెనర్లు రెచ్చిపోయారు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 

ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఊపు మీదున్న టీమిండియా నామమాత్రపు మూడో  వన్డేలో కూడా రెచ్చిపోయింది.  ఓపెనర్లు   రోహిత్ శర్మ (85 బంతుల్లో 101,  9 ఫోర్లు, 6 సిక్సర్లు),  శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112, 13 ఫోర్లు, 5 సిక్సర్లు)  వీరబాదుడు బాదడంతో   భారత జట్టు  భారీ స్కోరు సాధించింది.   ఈ ఇద్దరి దూకుడుతో పాటు చివర్లో హార్ధిక్ పాండ్యా  రెచ్చిపోవడంతో  నిర్ణీత 50 ఓవర్లలో  భారత్.. 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఇదివరకే సిరీస్ కోల్పోయిన  కివీస్.. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలుగుతుందా..?  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  భారత్ కు ఓపెనర్లు గిల్, రోహిత్ లు  అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.  జాకబ్  డఫ్ఫీ వేసిన  మూడో ఓవర్లో  రెండు  ఫోర్లు కొట్టిన రోహిత్..   తర్వాత కాస్త నెమ్మదించినట్టు కనిపించాడు. కానీ మరో ఎండ్ లో గిల్ మాత్రం  తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు.  డఫ్ఫీ వేసిన   ఐదో  ఓవర్లో  రెండో బంతికి సిక్సర్ బాదిన గిల్.. ఫెర్గూసన్ వేసిన  8వ ఓవర్లో  4, 4, 4, 6, 4  బాదాడు. 

బాదుడు మంత్రం.. 

గిల్ బాదుడుతో రోహిత్ కూడా బ్యాట్ కు పనిచెప్పాడు.  డఫ్ఫీ వేసిన  10వ ఓవర్లో రోహిత్ కూడా.. 4, 6, 6  కొట్టాడు. దీంతో పది ఓవర్లకే భారత్ 80 పరుగులు దాటింది. సాంట్నర్ వేసిన 12వ ఓవర్లో  రెండో బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న  గిల్..  తర్వాత  మరింతగా రెచ్చిపోయాడు. 12.4 ఓవర్లలోనే భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. సాంట్నర్ వేసిన  14వ ఓవర్ లో రోహిత్ రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. 

అర్థ సెంచరీల తర్వాత  ఈ ఇద్దరూ  మరింత స్పీడ్ పెంచారు. డారెల్ మిచెల్ బౌలింగ్ లో  6, 4 బాది 90లలోకి వచ్చాడు రోహిత్. బ్రాస్‌వెల్ వేసిన  23వ ఓవర్లో 4,6  కొట్టి గిల్ కూడా నైంటీస్ లోకి చేరాడు.   టిక్నర్ వేసిన  26వ  ఓవర్లో  మూడో బంతికి సింగిల్ తీసిన   రోహిత్ తన కెరీర్ లో 30వ వన్డే సెంచరీని  సాధించాడు. ఆ తర్వాత ఆరో బంతికి గిల్  ఫోర్ బాది  తన నాలుగో వన్డే శతకాన్ని అందుకున్నాడు. వీళ్లిద్దరి వీరవిహారంతో భారత్.. 26 ఓవర్లలోనే 212 పరుగులు చేసింది. 

పతనం ప్రారంభం.. 

సెంచరీ తర్వాత  రోహిత్.. బ్రాస్‌వెల్ బౌలింగ్ లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఓవర్లో   గిల్ కూడా టిక్నర్ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  వన్ డౌన్ లో వచ్చిన  కోహ్లీ (27 బంతుల్లో 36, 3 ఫోర్లు, 1 సిక్సర్).. జోరుమీదే కనిపించాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 17, 1 ఫోర్, 1 సిక్స్)  కలిసి కోహ్లీ 38 పరుగులు జోడించాడు. కానీ సమన్వయ లోపం కారణంగా ఇషాన్ రనౌట్ కాగా కొద్దిసేపటికే   కోహ్లీ కూడా   డఫ్ఫీ బౌలింగ్ లో ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చాడు.  సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. వాషింగ్టన్ సుందర్ (9) కూడా అదే బాట పట్టాడు. 

హార్ధిక్ మెరుపులు.. 

ఒకదశలో 500 పరుగులు చేయడం పక్కా అన్న ధీమాగా ఉన్న టీమిండియా..  వరుస వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్ లో పడింది.   మిడిలార్డర్ వైఫల్యంతో  మిడిల్ ఓవర్స్ లో పరుగుల రాక కష్టమైంది.  కోహ్లీ నిష్క్రమణ తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలుత నెమ్మదిగా ఆడాడు.  కానీ చివర్లో బ్యాట్ ఝుళిపించాడు. శార్దూల్ ఠాకూర్ (17 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్)  మెరుపులు మెరిపించాడు.  ఇద్దరూ కలిసి  ఏడో వికెట్ కు  54 పరుగులు జోడించారు. కానీ చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు. ఫలితంగా భారత్..  385 వద్దే పరిమితమైంది. 

కివీస్ బౌలర్లలో  జాకబ్ డఫ్ఫీకి మూడు వికెట్లు దక్కాయి. కానీ అతడు.. పది ఓవర్లలో  ఏకంగా వంద పరుగులు సమర్పించుకున్నాడు.  టిక్నర్ కు కూడా 3 వికెట్లు పడ్డాయి. అతడు కూడా  10 ఓవర్లలో 76 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రాస్‌వెల్ కు ఒక వికెట్ దక్కింది. 

click me!