INDvsENG 3rd ODI: ఫైనల్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... సిరీస్ గెలిచేదెవరు?...

Published : Jul 17, 2022, 03:06 PM ISTUpdated : Jul 17, 2022, 03:10 PM IST
INDvsENG 3rd ODI: ఫైనల్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... సిరీస్ గెలిచేదెవరు?...

సారాంశం

ఆఖరి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ... జస్ప్రిత్ బుమ్రాకి గాయం... తుది జట్టులోకి మహ్మద్ సిరాజ్...

ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. మొదటి రెండు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మ్యాచ్‌లో గెలిచి, ఓదాంట్లో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలు కూడా పూర్తిగా 100 ఓవర్ల పాటు జరగకపోవడం విశేషం. దీంతో కనీసం ఫైనల్ మ్యాచ్‌లో అయినా పూర్తి ఓవర్ల పాటు వన్డే మ్యాచ్‌ని ఆస్వాదించే అవకాశం దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

గత ఏడాది ఆరంభమైన టెస్టు సిరీస్‌లో మిగిలిపోయిన ఐదో టెస్టును గెలిచి, సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చూపించిన భారత జట్టు సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది...

దీంతో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుని, భారత జట్టుపై ఆధిపత్యం చాటుకోవాలని చూస్తోంది ఇంగ్లాండ్ జట్టు. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని... భారత జట్టుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్...

2014లో చివరిసారిగా ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ గెలిచింది భారత జట్టు. ఆ తర్వాత 2018లో మొదటి వన్డే గెలిచి 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లినా, ఆ తర్వాత వరుసగా రెండు వన్డేల్లో ఓడి 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది...

దీంతో 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ శర్మకు అద్భుత అవకాశం దక్కింది. ఇంతకుముందు మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెస్ ధోనీ మాత్రమే కెప్టెన్లుగా ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ గెలిచారు...

భారత ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, రోహిత్ శర్మల కలిసి ఓపెనింగ్ చేయడం ఇది 115వ సారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి వన్డేల్లో 114 సార్లు ఓపెనింగ్ చేశారు. వీరూ- సచిన్ రికార్డును అధిగమించిన ధావన్ - రోహిత్ శర్మ జోడి... 176 సార్లు ఓపెనింగ్ చేసిన సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానంలో నిలిచారు...

తొలి రెండు వన్డేల్లో అదిరిపోయే బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌కి తుది జట్టులో చోటు దక్కింది...

ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, క్రెగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లే, బ్రిడ్ కార్స్, రేస్ తోప్లే

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్, ప్రసిద్ధ్ కృష్ణ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !