
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ టెస్టులో భారత్ మూడో సెషన్ ప్రారంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన భారత్.. టీ తర్వాత తొలి ఓవర్లోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) వికెట్ ను కోల్పోయింది. సెంచరీ చేసి భారత్ ను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్న రోహిత్ నిష్క్రమణతో ఆ బాధ్యత ఇప్పుడు రవీంద్ర జడేజా (88 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు) మీద పడింది. తొలి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం భారత్.. 84 ఓవర్లు ముగిసేటప్పటికీ 7 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 65 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
లంచ్ తర్వాత తొలి బంతికే కోహ్లీ (12) వికెట్ కోల్పోయిన భారత్.. కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ (8) రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా రెండు వికెట్లు పడటంతో ఆసీస్ పట్టు బిగించాలని చూసింది. కానీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లు ఆసీస్ కు ఆ అవకాశామివ్వలేదు. ఇద్దరూ కలిసి మర్ఫీ, లియాన్, బొలాండ్, కమిన్స్ లతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ లబూషేన్ ను ధీటుగా ఎదుర్కున్నారు.
సెంచరీ తర్వాత రోహిత్ నిలకడగానే ఆడాడు. అడపాదడపా జడేజా బౌండరీలు బాదినా రోహిత్ మాత్రం సింగిల్స్, డిఫెన్స్ కే ప్రాధాన్యమిచ్చాడు. రెండె సెషన్ (టీ టైమ్) వరకు భారత్.. 80 ఓవర్లలో 5 వికెట్ల కు 226 పరుగులు చేసింది. అయితే టీ తర్వాత ఆసీస్ కొత్తబంతిని తీసుకుంది.
ఆసీస్ సారథి కమిన్స్ వేసిన 81వ ఓవర్లో మూడో బంతికి రోహిత్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. కానీ ఆ తర్వాత బంతికే హిట్‌మ్యాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో జడేజా - రోహిత్ ల 61 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రోహిత్ స్థానంలో వచ్చిన ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ (10 బంతుల్లో 8) కూడా టాడ్ మర్ఫీ వేసిన 84వ ఓవర్లో తొలి బంతికి ఎల్బీ రూపంలో నిష్క్రమించాడు. దీంతో భారత్ ఏడో వికెట్ ను కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మర్ఫీకి ఈ మ్యాచ్ లో ఇది ఐదో వికెట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు మర్ఫీ.. 27 ఓవర్లు వేసి ఐదు మెయిడిన్లతో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
భరత్ ఔటయ్యాక అక్షర్ పటేల్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. పటేల్ తో కలిసి జడేజా భారత ఇన్నింగ్స్ ను ఏ మేరకు నడిపిస్తారో చూడాలి.