హిట్‌మ్యాన్ సెంచరీ.. అరుదైన ఘనత సొంతం చేసుకున్న టీమిండియా సారథి.. భారత్ నుంచి తొలి ఆటగాడిగా రికార్డు..

Published : Feb 10, 2023, 12:57 PM IST
హిట్‌మ్యాన్ సెంచరీ.. అరుదైన ఘనత సొంతం చేసుకున్న టీమిండియా సారథి.. భారత్ నుంచి తొలి ఆటగాడిగా రికార్డు..

సారాంశం

Border Gavaskar Trophy 2023: టీమిండియా సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.  భారత జట్టు తరఫున అన్ని ఫార్మట్లలోనూ సెంచరీ చేసిన సారథిగా నిలిచాడు. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  టీమిండియా సారథి రోహిత్ శర్మ (172 బంతుల్లో 101 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు.  తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడంతో  రోహిత్.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి  కెప్టెన్ గా  రికార్డులకెక్కాడు. టాడ్ మర్ఫీ వేసిన  63వ ఓవర్లో  ఫోర్ కొట్టడం ద్వారా రోహిత్ శతకం (171 బంతులలో) పూర్తైంది.  రోహిత్ సెంచరీతో  తొలి ఇన్నింగ్స్ లో భారత్.. ఆసీస్ స్కోరు (177) ను దాటేసి  ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. 

కెప్టెన్ అయ్యాక రోహిత్.. సుమారు రెండున్నరేండ్ల తర్వాత  వన్డేలలో  ఇటీవలే న్యూజిలాండ్ మీద  సెంచరీ చేశాడు.    2020లో చివరిసారి సెంచరీ చేసిన  హిట్‌మ్యాన్.. ఆ తర్వాత  ఎక్కువగా టీ20లకే పరిమితమయ్యాడు. మధ్యలో  కరోనా,  గాయాలా కారణంగా చాలా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. 

టీ20లలో  కూడా రోహిత్ కు నాలుగు సెంచరీలున్నాయి.   రోహిత్.. 2021లో విరాట్ కోహ్లీ   తప్పుకున్నాక  అధికారికంగా సారథ్య బాధ్యతలు తీసుకున్నా  కోహ్లీ గైర్హాజరీలో పలు మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించాడు.  పొట్టి ఫార్మాట్ లో  హిట్ మ్యాన్ నాలుగు సెంచరీలు చేయగా అందులో రెండు సార్లు అతడు   తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నప్పుడు చేసినవే కావడం గమనార్హం.   

ఇక వన్డేలలో  ఇటీవలే కివీస్ మీద  సెంచరీ బాదిన  రోహిత్..  తాజాగా ఆసీస్ తో  మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన సారథిగా నిలిచాడు.  గతంలో ధోని, కోహ్లీలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.  తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి సారథిగా  రోహిత్ రికార్డు పుటల్లోకెక్కాడు. 

అంతర్జాతీయంగా  చూస్తే ఈ ఘనత సాధించిన కెప్టెన్లలో  రోహిత్ నాలుగో  స్థానంలో నిలిచాడు.  శ్రీలంక   సారథి తిలకరత్నే దిల్షాన్.. సారథిగా మూడు ఫార్మాట్లలో  సెంచరీలు చేసిన తొలి కెప్టెన్.  దిల్షాన్ కెప్టెన్ గా టెస్టులలో ఇంగ్లాండ్, వన్డేలలో   జింబాబ్వే,  టీ20లలో ఆస్ట్రేలియాపై  సెంచరీలు బాదాడు. ఆ తర్వాత  సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఈ రికార్డు ఉంది.  డుప్లెసిస్.. కెప్టెన్ గా టెస్టులలో న్యూజిలాండ్, వన్డేలలో  ఆస్ట్రేలియా, టీ20లలో వెస్టిండీస్ మీద సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ కూడా  ఉన్నాడు. బాబర్ సారథిగా   గతేడాది ఆస్ట్రేలియాపై, వన్డేలలో జింబాబ్వేపై టీ20లలో  సౌతాఫ్రికాపై శతకాలు  చేశాడు.  

తడబడుతున్న టీమిండియా.. 

నాగ్‌పూర్ టెస్టులో లంచ్ తర్వాత భారత్ తడబడుతోంది. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు.  లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లీ (12)ని మర్ఫీ పెవిలియన్ చేర్చాడు.  కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (8) కూడా  ఆకట్టుకోలేదు.  నాథన్ లియాన్ బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ప్రస్తుతం  భారత్..  63 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  178 పరుగులు చేసింది. రోహిత్ తో పాటు రవీంద్ర జడేజా (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు.   ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసినా భారత్  ఎంత ఆధిక్యం సాధిస్తుందనేది కీలకం.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !