షమీ దంచగా.. స్కోరు పెంచగా.. నాగ్‌పూర్‌లో 200 దాటిన భారత్ ఆధిక్యం..

Published : Feb 11, 2023, 11:16 AM ISTUpdated : Feb 11, 2023, 11:18 AM IST
షమీ దంచగా.. స్కోరు పెంచగా..  నాగ్‌పూర్‌లో 200 దాటిన భారత్ ఆధిక్యం..

సారాంశం

Border Gavaskar Trophy: నాగ్‌పూర్ టెస్టును భారత్ శాసించే స్థితికి చేరుకుంది.  మూడో రోజు ఉదయం రవీంద్ర జడేజా వికెట్ ను త్వరగానే కోల్పోయినా  తర్వత వచ్చిన మహ్మద్ షమీ వీరబాదుడు బాదాడు.   

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.  మూడో రోజు  ఉదయం ఆట ఆరంభించిన  భారత జట్టుకు ఆదిలోనే షాక్ తాకింది.  నిన్నటి స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జోడించి రవీంద్ర జడేజా (70)  మర్ఫీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  కానీ  అక్షర్ పటేల్  (166 బంతుల్లో  82, 10 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో మహ్మద్ షమీ  (47 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  షమీ దూకుడుతో  తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం   220 పరుగులు దాటింది.   ప్రస్తుతం భారత్.. 137 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి  397   పరుగులు చేసింది. 

ఓవర్ నైట్ స్కోరు  321  పరుగుల వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన  భారత్..  జడేజా వికెట్ ను త్వరగానే కోల్పోయింది.  టాడ్ మర్ఫీ వేసిన   119వ ఓవర్  లో రెండో బంతికి జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  మర్పీ  వేసిన   బంతిని జడ్డూ వదిలేయగా.. అది కాస్తా ఆఫ్ స్టంప్ ముందు టర్న్ అయి బెయిల్స్ ను పడగొట్టింది.  దీంతో   88 పరుగుల 8 వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

జడేజా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన  మహ్మద్ షమీ..  వస్తూనే లియన్ బౌలింగ్ లో ఫోర్ బాదాడు. లియాన్ వేసిన 122వ ఓవర్లో షమీ ఇచ్చిన ఓ క్యాచ్ ను  బొలాండ్ వదిలేశాడు. దానికి ఆసీస్ భారీ మూల్యమే చెల్లించుకుంది.  తనకు దొరికిన అవకాశాన్ని షమీ  చక్కగా వాడుకున్నాడు.  మర్ఫీ బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టిన షమీ.. అతడే వేసిన  130వ ఓవర్లో  రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు.  ఇదే ఓవర్లో చివరి బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ ఇద్దరి భాగస్వామ్యం  50 పరుగులు దాటింది. 

 

అయితే  ఆ  తర్వాత  మర్ఫీ  132వ ఓవర్ లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి  వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చాడు. 9వ వికెట్ కు అక్షర్ తో కలిసి షమీ  52 పరుగులు జోడించాడు.  మరోవైపు  అక్షర్ కూడా  నిలకడగా ఆడుతన్నాడు.   మర్ఫీ వేసిన  134వ ఓవర్లో ఫోర్ కొట్టి 70లలోకి వచ్చాడు.  సిరాజ్ అండగా నిలిస్తే అక్షర్.. సెంచరీ దిశగా అడుగులు వేసే అవకాశముంది.  

ఉదయం సెషన్ లో   భారత్ రెండు వికెట్లు కోల్పోగా  ఆ ఇద్దరూ మర్ఫీ బౌలింగ్ లోనే ఔట్ అయ్యారు.  దీంతో అతడు ఇప్పటివరకు  ఈ టెస్టులో ఏడు వికెట్లు తీసుకున్నాడు.  

సంక్షిప్త స్కోర్లు : 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్ 
భారత్ తొలి ఇన్నింగ్స్ :  397-9 (137 ఓవర్లకు) 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !