
నాగ్‌పూర్ టెస్టులో భారత జట్టు 400 పరుగులకు ఆలౌట్ అయింది. 321 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి సెషన్ ఆరంభించిన భారత్.. నాలుగో ఓవర్లోనే రవీంద్ర జడేజా (70) వికెట్ ను కోల్పోయింది. జడ్డూ స్థానంలో వచ్చిన మహ్మద్ షమీ (47 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షమీతో పాటు అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84, 10 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడాడు. సెంచరీ దిశగా సాగుతున్న అతడిని కమిన్స్ బౌల్డ్ చేయడంతో భారత్.. 400 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఓవర్ నైట్ స్కోరు 321 పరుగుల వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. జడేజా వికెట్ ను త్వరగానే కోల్పోయింది. టాడ్ మర్ఫీ వేసిన 119వ ఓవర్ లో రెండో బంతికి జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మర్పీ వేసిన బంతిని జడ్డూ వదిలేయగా.. అది కాస్తా ఆఫ్ స్టంప్ ముందు టర్న్ అయి బెయిల్స్ ను పడగొట్టింది. దీంతో 88 పరుగుల 8 వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
జడేజా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ.. వస్తూనే లియన్ బౌలింగ్ లో ఫోర్ బాదాడు. లియాన్ వేసిన 122వ ఓవర్లో షమీ ఇచ్చిన ఓ క్యాచ్ ను బొలాండ్ వదిలేశాడు. దానికి ఆసీస్ భారీ మూల్యమే చెల్లించుకుంది. తనకు దొరికిన అవకాశాన్ని షమీ చక్కగా వాడుకున్నాడు. మర్ఫీ బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టిన షమీ.. అతడే వేసిన 130వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్లో చివరి బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.
అయితే ఆ తర్వాత మర్ఫీ 132వ ఓవర్ లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చాడు. 9వ వికెట్ కు అక్షర్ తో కలిసి షమీ 52 పరుగులు జోడించాడు. మరోవైపు అక్షర్ కూడా నిలకడగా ఆడుతన్నాడు. మర్ఫీ వేసిన 134వ ఓవర్లో ఫోర్ కొట్టి 70లలోకి వచ్చాడు. అతడే వేసిన 136వ ఓవర్లో భారీ సిక్సర్ ద్వారా 80లలోకి చేరాడు. ఈ క్రమంలో అతడు సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ ఆసీస్ సారథి కమిన్స్ వేసిన 139 ఓవర్లో మూడో బంతికి అక్షర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆసీస్ బౌలర్లలో కొత్త కుర్రాడు టాడ్ మర్ఫీకి ఏడు వికెట్లు దక్కగా కమిన్స్ కు రెండు, లియాన్ కు ఒక వికెట్ దక్కింది.
కంగారూలు నిలదొక్కుకునేనా..?
శనివారం ఉదయం సెషనల్ లోనే బంతి గింగిరాలు తిరిగింది. రవీంద్ర జడేజాను మర్పీ ఔట్ చేసిన బంతే ఇందుకు సాక్ష్యం. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని జడేజా వదిలేయగా అది కాస్తా ఆఫ్ స్టంప్ బెయిల్స్ ను పడగొట్టింది. సాధారణంగా భారత్ పిచ్ లు టెస్టులలో మూడో రోజు నుంచి ఎక్కువ టర్న్ అవుతుంటాయి. మరి అశ్విన్, జడేజా, అక్షర్ ల ముక్కోణపు దాడిని కంగారూలు ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరం.
సంక్షిప్త స్కోర్లు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 400 ఆలౌట్